కోలీవుడ్ రూల్స్‌కి వ్యతిరేకంగా పవన్ కౌంటర్‌కు మద్ధతు!
Support for Pawan Counter against Kollywood rules
By: Tupaki Desk | 30 July 2023 10:59 AM ISTసినిమా వ్యాపారంలో సూపర్‌స్టార్ల శకం ముగిసిపోయిందని.. ప్రతి స్టార్‌కి తనదైన మార్కెట్ వాటా ఉంటుందని తమిళనిర్మాత ఎస్.ఆర్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ``హద్దులు దాటి విస్తరిస్తున్న తెలుగు చిత్రపరిశ్రమను చూసి నేర్చుకోవాలి`` అని ఆయన కోలీవుడ్ నిర్మాతలకు సూచించారు.
తాజా ఈవెంట్లో నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ``సినిమా వ్యాపారంలో సూపర్ స్టార్ ల శకం ముగిసింది. ప్రతి స్టార్‌కి తన సొంత మార్కెట్ వాటా ఉంటుంది. ప్రతి చిత్రానికి విడుదల తేదీ.. కంటెంట్.. కాంబినేషన్.. పోటీ.. మొదలైన వాటి ఆధారంగా విలువ మారుతుంది. దీన్ని అర్థం చేసుకున్న పరిశ్రమ ఒకరినొకరు ఆదరించి మార్కెట్ పరిధిని పెంచుతూ హద్దులు దాటి విస్తరించడం ప్రారంభిస్తుంది. దీనికి తాజా ఉదాహరణ తెలుగు సినీపరిశ్రమ. ఈ విషయాన్ని ఆయా పరిశ్రమల్లోని స్టార్లు.. ట్రేడ్ .. అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధానం ప్రతిచోటా ప్రతి పరిశ్రమలో కొత్త ప్రమాణంగా మారుతుంది. మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ వాణిజ్యం అత్యుత్తమ ప్రమాణాలకు ఎదగాలి. అభిమానులు తమ ఆలోచనల పరంగా ఎదగాలని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
నిజానికి తమిళ చిత్రసీమలో తమిళులకు మాత్రమే అవకాశాలు కల్పించాలన్న `ఫెఫ్సీ` (ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI)) ఆలోచనకు ఎస్.ఆర్.ప్రభు ప్రకటన విరుద్ధమైనది. ఇటీవల `బ్రో` ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని టచ్ చేస్తూ ఫ్యాఫ్సీ తీరు తెన్నులను తీవ్రంగా తప్పు పట్టారు. కుంచించుకుపోయిన ఆలోచనలతో కాకుండా అందరినీ కలుపుకుపోయే ఆలోచనలు కావాలని పవన్ సూచించారు. ఇప్పుడు ఎస్.ఆర్.ప్రభు వ్యాఖ్యలు దీనికి మద్ధతుగా నిలిచాయి. అయితే తమిళ సీనియర్ నటుడు నాజర్ ఇంతకుముందే పవన్ వ్యాఖ్యల్ని ఖండించారు. తమిళ పరిశ్రమ ఇరుగు పొరుగు నటీనటులకు అవకాశం కల్పిస్తోందని నాజర్ అభిప్రాయపడ్డారు. పొరుగు ప్రతిభను తాము అన్నివేళలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఒకవేళ అలా జరగకపోతే ఖండించే వారిలో తానే ముందుంటానని కూడా అన్నారు.
