సూపర్ స్టార్ లో అహం కరిగిన వేళ!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికోసారి హిమాలయాలకు వెళ్లొస్తుంటారు.
By: Srikanth Kontham | 13 May 2026 11:45 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికోసారి హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. సూపర్ స్పూర్తితో ఎంతో మంది కోటీశ్వర్లు ఆ తరహా మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బిజీ లైఫ్ లో? కొన్ని రోజలైనా ప్రశాంతమైన జీవితం కోసం జన జీవనానికి దూరంగా ఉండేదుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
తాజాగా రజనీకాంత్ జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి రివీల్ చేసి షాక్ ఇచ్చారు. తనలో అహాన్ని ఆధ్మా త్మిక చింతన అనేది ఎలా తుడిచి పెట్టిందో గుర్తు చేసుకున్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో జరిగిన వింత అనుభవం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎంతటి ఉన్నత శిఖరాల్లో ఉన్నా? మనిషి ప్రకృతి , దైవం ముందు ఎంతటి అల్పుడో ఈ ఘటన ద్వారా వివరించారు. చాలా ఏళ్ల క్రితం రజనీకాంత్ బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ అందరిలాగే ఆయన కూడా సామాన్యుడిగా గడపాలని భావించారు. ఆ సమయంలో రజనీకాంత్ తన ముఖానికి ముసుగు ధరించి, గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అయితే అక్కడ పనులు చేస్తున్న కొందరు వ్యక్తులు తన వైపు ఆసక్తిగా చూడటం గమనించిన రజనీకాంత్ తానొక పెద్ద స్టార్‌ని కాబట్టి వారు గుర్తుపట్టేసి ఉంటారని మనసులో అనుకున్నారు.
`నేను సూపర్ స్టార్ రజనీకాంత్‌ని అనే చిన్నపాటి అహం అప్పుడు ఆయనలో తలెత్తింది. కానీ కొద్దిసేపటి తర్వాత రజనీకాంత్ కి అసలు విషయం అర్థమైంది. అక్కడ ఉన్నవారు తనను ఒక నటుడిగానో లేదా స్టార్‌గానో చూడటం లేదని ఒక ముసలి వ్యక్తి ఎందుకు అంత దీనంగా కనిపిస్తున్నాడనే జాలితో చూస్తున్నారని గ్రహించారు. ఒక మహిళ ఆయన దగ్గరకు వచ్చి పది రూపాయల నోటును చేతిలో పెట్టి బాబా.. ఇది తీసుకో ఏదైనా తిను అని అంది. ఆ క్షణం రజనీకాంత్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తానొక గొప్ప వ్యక్తిని అనుకుంటున్న సమయంలో ఎదుటివారు తనను ఒక యాచకుడిగా భావించి సహాయం చేయడం ఆయనలోని అహాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది.
ఆ పది రూపాయల నోటును ఆయన ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారట. అది కేవలం డబ్బు మాత్రమే కాదని దేవుడు తనకు నేర్పిన గొప్ప పాఠమని రజనీకాంత్ భావిస్తారు. ఆ సంఘటన తర్వాత తనలో ఉన్న నేను అనే భావం పూర్తిగా కరిగిపోయిందని వినయం మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు. మనల్ని మనం ఎంత గొప్పగా ఊహించుకున్నా? సమాజం లేదా కాలం ఎలాగైనా చూడవచ్చని అందుకే ఎప్పుడూ ఒదిగి ఉండాలని రజనీకాంత్ అనుభవం ద్వారా చాటి చెప్పారు. సూపర్ స్టార్ హోదాలో ఉండి కూడా తనపై తానే జోకులు వేసుకోవడం తనను ఒక బిచ్చగాడిగా భావించిన సంఘటనను బహిరంగంగా పంచుకోవడం రజనీకాంత్ హుందాతనాన్ని తెలి యజేస్తుంది.
ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి అహంకారం అనేది ఒక పెద్ద అడ్డంకి అని దానిని వదిలిం చుకున్నప్పుడే నిజమైన జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో జరిగిన ఈ అనుభవం తన జీవిత దృక్పథాన్ని మార్చేసిందని రజనీకాంత్ కృతజ్ఞతతో స్మరించుకున్నారు. రజనీకాంత్ చెప్పిన ఈ కథ కేవలం సినిమా అభిమానులకే కాదు. ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. హోదా, డబ్బు, పేరు అనేవి శాశ్వతం కావు. మనలోని మంచితనం, వినయం మాత్రమే మనల్ని ఉన్నతంగా నిలబెడతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. పది రూపాయల నోటుతో ఓ మహానటుడి అహాన్ని కరిగించిన ఆ మహిళ, ఆయన దృష్టిలో దైవంతో సమానమయ్యారు.
