కృష్ణ ఒకే హీరోయిన్‌తో 45 సినిమాలు చేశారు తెలుసా..!
సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకున్నా ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ను గుర్తుకు తెస్తూనే ఉంటాయి.
By: Tupaki Desk | 2 Jun 2025 10:09 AMసూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకున్నా ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ను గుర్తుకు తెస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో, తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకు వెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం అంటూ అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా జయంతి సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన చేసిన సినిమాల గురించి, ఆయన పాత్రల గురించి మాట్లాడుకున్నారు.
కృష్ణ ఎన్నో రకాల పాత్రలను చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మరే హీరో పోషించనన్ని పాత్రలను కృష్ణ పోషించారని, మొదటి కౌబాయ్ సినిమా మొదలుకుని బాండ్ సినిమా వరకు కృష్ణ చేసిన తర్వాతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోలు చేశారు అంటూ అభిమానులు గొప్పగా, గౌరవంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక వందల కొద్ది సినిమాలు చేసిన కృష్ణ అత్యధికంగా సీనియర్ హీరోయిన్ జయప్రదతో నటించారు. పది కాదు.. ఇరవై కాదు ఏకంగా 45 సినిమాలను జయప్రదతో కృష్ణ కలిసి నటించారు. ఇలాంటి రికార్డ్ చాలా అరుదుగా మాత్రమే నమోదు అవుతూ ఉంటుంది. ఈ తరం హీరోలు ఎవరూ కూడా ఒకే హీరోయిన్‌తో కనీసం అయిదు.. పది సినిమాలు చేసే పరిస్థితి లేదు.
అప్పట్లో హీరోలు నెలకు ఒకటి, అంతకు మించి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సఫలం అయ్యారు. చాలా స్పీడ్‌గా సినిమాలు చేయడంతో పాటు, వందల కొద్ది సినిమాల సంఖ్యను కలిగి ఉన్నారు. అందుకే వారు ఎక్కువ సినిమాలను ఒకే హీరోయిన్‌తో చేసే అవకాశం ఉండేది. అందుకే కృష్ణ ఏకంగా 45 సినిమాల్లో హీరోయిన్‌గా జయప్రద నటించారు. జయప్రద, కృష్ణ కాంబోలో వచ్చిన సింహాసనం, రామరాజ్యంలో భీమరాజు, మహాసంగ్రామం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వీరి కాంబోకి హిట్ పెయిర్‌గా పేరు దక్కింది. హీరోగా కృష్ణ ఇంకా పదుల సంఖ్యలో హీరోయిన్స్‌తో నటించారు.
కృష్ణ చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు. ఆయన తన జీవితం మొత్తం సినిమాలకు అంకితం చేశారు. ఆయన మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అనడంలో సందేహం లేదు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ ట్యాగ్‌ను దక్కించుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది.