సూపర్‌మ్యాన్ మూవీ టాక్ ఎలా ఉంది?
డీసీ యూనివర్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఫ్రాంచైజ్ “సూపర్‌మ్యాన్” ఇప్పుడు రీబూట్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 12 July 2025 10:37 AM ISTడీసీ యూనివర్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఫ్రాంచైజ్ “సూపర్‌మ్యాన్” ఇప్పుడు రీబూట్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ జేమ్స్ గన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాత ఫ్రాంచైజ్‌ను మరింత కొత్తగా, ఎమోషన్స్ తో పాటు యాక్షన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా సూపర్‌మ్యాన్ పాత్రలో డేవిడ్ కొరెన్స్‌వెట్ నటనకు భారీగా ప్రశంసలు వస్తున్నాయి.
ఈ చిత్రం కథ పరంగా చూస్తే.. సూపర్‌మ్యాన్ మరోసారి ప్రపంచాన్ని రక్షించాల్సిన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో, అతని ఎదుగుదల వెనక ఉన్న భావోద్వేగాలు, కుట్రలు, అతడి వ్యక్తిగత సంబంధాల అంతరాలు అన్నీ కలిపి పక్కాగా చెప్పబడ్డాయి. ఈసారి కూడా అతడిని ఎదుర్కొనేది లెక్స్ లూథర్ అనే టెక్ మాస్టర్. ఇతడి శత్రుత్వానికి కారణాలు, అతని అంతర్లీన ఉద్దేశాలు కథకు బలాన్ని చేకూర్చాయి.
సూపర్‌మ్యాన్‌ను హ్యూమన్‌గా చూపించాలన్న దర్శకుడి ప్రయత్నం ఫస్ట్ హాఫ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, రెండో భాగంలో కథ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ముఖ్యంగా పాకెట్ యూనివర్స్‌లో జరిగే సంఘటనలు, అక్కడ సూపర్ డాగ్ సన్నివేశాలు, లొయిస్ లేన్ పాత్రతో కలిసి వచ్చే సన్నివేశాలు యూత్‌ను ఆకట్టుకుంటాయి. చివర్లో ప్రజలే సూపర్‌మ్యాన్‌కి మళ్లీ మద్దతు ఇవ్వడం భావోద్వేగంతో నిండిన క్లైమాక్స్‌కు దారి తీస్తుంది.
నటుల విషయానికి వస్తే, డేవిడ్ కొరెన్స్‌వెట్ సూపర్‌మ్యాన్ పాత్రలో తన శక్తిని పూర్తిగా వినియోగించాడు. హీరోయిజానికి తోడు, భావోద్వేగాల సన్నివేశాలలో కూడా ఆకట్టుకున్నాడు. రెచెల్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ మంచి ప్లస్‌గా నిలిచాయి. నికలస్ హోల్ట్ లెక్స్ లూథర్ పాత్రకు న్యాయం చేశాడు. ఇతర తారాగణం కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా కనిపించారు.
సాంకేతికంగా సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ హైస్‌ని బలంగా చూపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ స్టైలిష్‌గా డిజైన్ చేయబడ్డాయి. మరి కొన్నిచోట్ల లాజిక్ లోపించిందనే విమర్శలున్నా, మొత్తం మీద ఇది ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రేక్షకులకు బాగానే నచ్చుతుంది. మొత్తంగా చెప్పాలంటే, ఈ సూపర్‌మ్యాన్ సినిమాను ఫ్యామిలీతో కలిసి నిశ్చింతగా ఎంజాయ్ చేయొచ్చు. డీసీ అభిమానులకు ఇది ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. జేమ్స్ గన్ తీసుకున్న ఫ్రీడమ్ కొన్నిచోట్ల ప్రశ్నలు రేపినా, కథను కొత్తగా చెప్పాలన్న ఆయన ప్రయత్నం మెప్పించవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
