Begin typing your search above and press return to search.

జాట్ 2 అనౌన్సమెంట్ వెనుక మైత్రీ ప్లాన్ ఇదేనా..?

సన్నీ డియోల్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జాట్ గురించి మొదట్లో బాగా చర్చ జరిగింది.

By:  Tupaki Desk   |   18 April 2025 1:15 PM IST
Despite Flop Talk, Sunny Deols ‘Jatt 2’ Announced
X

సన్నీ డియోల్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జాట్ గురించి మొదట్లో బాగా చర్చ జరిగింది. బాలీవుడ్‌లో మాస్ హంగామాకు ఇది న్యూ ఏజ్ రీఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మిక్స్‌డ్ టాక్ రావడంతో రెండో వారానికి వెళ్లే సరికి థియేటర్లలో కలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ జాట్ 2ని అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితేనే దానికి సీక్వెల్ పిలుపు వస్తుంది. కానీ జాట్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.70 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఇది సినిమా బడ్జెట్ అయిన రూ.150 కోట్లలో సగం కూడా కాదు. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ దశను దాటలేదు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో అయితే సినిమా డిజాస్టర్ రేంజ్‌కి వెళ్లిందన్న ట్రేడ్ రిపోర్ట్‌లు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో “జాట్ 2”ని అనౌన్స్ చేయడం వెనుక అసలైన ఉద్దేశ్యం ఏమిటంటే, ఇప్పటికే డీలా పడిన కలెక్షన్లకు మరికొంత బూస్ట్ ఇవ్వాలని ఉండవచ్చు అనే టాక్ వస్తోంది. సినిమాలో ఇంకా ఆసక్తి ఉందనే భావనను పబ్లిక్‌లో నాటేందుకు మైత్రీ ఈ ప్రయత్నం చేసి ఉంటుందన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న అభిప్రాయం. ఎందుకంటే, నిజంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చిన ప్రాజెక్ట్‌కు వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేసే పరిస్థితి ఉండదు.

ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం.. సన్నీ డియోల్ ఈ సినిమాకు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ట్రేడ్ బజ్. అంటే ఈ ఒక్క విషయం చూసినా, నిర్మాతలకు థియేట్రికల్ షేర్ ద్వారా సగం కూడా తిరిగి రాకపోవచ్చు. పైగా డిజిటల్, శాటిలైట్ హక్కుల డీల్‌లు ఇంకా ఫైనల్ కాలేదన్న సమాచారంతో, రికవరీ చాలా కష్టమన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

అయితే పబ్లిక్‌కి మాత్రం ఈ అనౌన్స్మెంట్ సీక్వెల్ వస్తోందన్న ఉత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ అంతకు మించి అసలు సినిమా స్టాటస్‌ను మార్చగలదు అనుకోవడం అంత ఈజీ కాదు. వాస్తవానికి జాట్ 2 అనే పేరు ప్రకటించడమే కానీ, ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభం, కథ సిద్ధం, షూటింగ్ టైమ్‌లైన్ వంటి ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు. ఇది ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా ఉంటుందా అనే అనుమానాలను పెంచుతోంది. మొత్తం మీద జాట్ 2 ప్రకటన కంటే మైత్రీ మూవీ మేకర్స్ చేసిన టైమింగ్ మరింత ఆసక్తికరంగా మారింది. బిజినెస్ పరంగా లాభాలు కంటే నష్టాలు ఎదురవుతున్న ప్రాజెక్ట్‌కు రెండో వారానికి అయినా ఓ పాజిటివ్ ఇమేజ్ రావాలనే కోణంలో ఈ ‘సీక్వెల్ ప్రకటన’ జరిగిందని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇది ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.