Begin typing your search above and press return to search.

గీతాంజలి మళ్లీ వచ్చింది.. కిల్లర్ సునీల్

దీనితో పాటు సునీల్ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ లో సునీల్ ఒక హాంటెడ్ భ‌వ‌నం ముందు హాకీ స్టిక్‌తో నిల‌బ‌డి తీక్ష‌ణంగా చూస్తున్న‌ట్లు ఉంది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 1:26 PM GMT
గీతాంజలి మళ్లీ వచ్చింది.. కిల్లర్ సునీల్
X

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఎప్పుడో విడుదలైన సినిమాలకు కూడా సీక్వెల్స్‌ ను తెరకెక్కించడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014లో అంజలి హీరోయిన్‌గా తెరకెక్కించిన హారర్ మూవీ గీతాంజలికి కూడా పదేళ్ల తర్వాత సీక్వెల్ సిద్ధమయ్యింది. 2024 న్యూ ఇయర్ సందర్భంగా గీతాంజలికి సీక్వెల్ అయిన గీతాంజలి మళ్లీ వచ్చింది నుంచి అంజలి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.


ఈ మూవీలో టాలీవుడ్ హీరో క‌మ్ క‌మెడియ‌న్ సునీల్ కిల్ల‌ర్ నాని అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్‌ లో న‌టించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దీనితో పాటు సునీల్ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ లో సునీల్ ఒక హాంటెడ్ భ‌వ‌నం ముందు హాకీ స్టిక్‌తో నిల‌బ‌డి తీక్ష‌ణంగా చూస్తున్న‌ట్లు ఉంది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికిపైగా పూర్తయ్యిందని మేకర్స్ చెబుతున్నారు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అంజలి క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపిస్తుండగా ఒక పాతబడిన బిల్డింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. అంజ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంది.

ఇక ఈ మూవీని సమర్పిస్తున్న కోన వెంకట్‌తో సహా నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీలు కూడా బడ్జెట్‌ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్‌లో మొదటి భాగంలో నటించిన నటీనటులు కూడా కనిపించబోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలు ఒక ఎత్తైతే.. ఈ చిత్రం మరో ఎత్తు అని మేకర్స్ అంటున్నారు. నిన్ను కోరి, నిశ్శ‌బ్దం చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ శివ తుర్ల‌పాటి.. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.