నటవారసుడిని తొక్కేయాలని చూసారు
సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి బాలీవుడ్ లో అప్ కమ్ హీరోగా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నాడు.
By: Tupaki Desk | 23 May 2025 6:07 PM ISTఈ స్టార్ హీరో కింది స్థాయి నుంచి ఎదిగాడు. తన తండ్రి హోటల్‌లో ప్లేట్లు తీసానని చెప్పాడు. అతడు అంత కింది స్థాయి నుంచి ఎదిగాడు కాబట్టే, ఎప్పుడూ గర్వం అనేది కించిత్ అయినా కనిపించదు. అంతేకాదు.. గర్వం అహంకారం లేకుండా సినీపరిశ్రమలో ఎదిగిన హీరోగాను అతడి గురించి పాటిటివ్ గా చెబుతారు. తన తండ్రితో పాటు, తాను పని చేసిన హోటల్ ని కొనేసేంతగా ఎదిగాడు. చివరికి ఆ హోటల్ నే కొనేసి తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చాడు. అలాంటి పట్టుదల కలిగిన ఈ వ్యక్తి ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి. అతడు హిందీ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు. ఇటీవల దక్షిణాది సినిమాల్లోను నటిస్తున్నాడు. అయితే అలాంటి వ్యక్తి కుమారుడిపై ఒక సెక్షన్ దుష్ప్రచారం చేయడాన్ని సునీల్ శెట్టి జీర్ణించుకోలేకపోతున్నాడు.
సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి బాలీవుడ్ లో అప్ కమ్ హీరోగా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నాడు. అహన్ నటించిన మొదటి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా కానీ, తనకు ఉన్న సినీనేపథ్యం కారణంగా అవకాశాలు అందుకుంటున్నాడు. అహన్ ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక చిత్రం 'బార్డర్ 2'లో సన్నీడియోల్ తో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఉన్నట్టుండి ఎట్నుంచి వచ్చాయో కానీ, అహన్ శెట్టి గురించి చాలా దుష్ప్రచారం మొదలైంది. అతడు సెట్స్ లో గొంతెమ్మ కోర్కెలు కోరతాడని, తనకు, తన పరివారానికి కూడా సౌకర్యాలు కావాలని పట్టుబడతాడని, నిర్మాత డబ్బు ఆరగించేస్తాడని ప్రచారం సాగింది. అతడితో ప్రతిదీ టూమచ్ కాస్ట్ లీ వ్యవహారం అంటూ ప్రచారమైంది. ఉన్నట్టుండి ఒక యువహీరోపై ఇలాంటి ప్రచారం ఊహించనిది.
ఈ ప్రచారం కారణంగా అహన్ బాలీవుడ్ లో చాలా అవకాశాలు కోల్పోయాడని సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు.. తన కుమారుడిపై దుష్ప్రచారం చేసింది ఎవరో తనకు తెలుసునని, అన్యాయంగా అతడిపై నిందలు వేసారని శెట్టి ప్రత్యారోపణలు చేసారు. పత్రికలలో తనయుడి గురించి తప్పుడు ప్రచారం చేసిన ఈ వ్యక్తులు ఎవరో బయటపెడతానని సునీల్ శెట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అహన్ తాను పరిశీలిస్తున్న వాటిలో ఒకదానిని వదులుకుని 'బార్డర్ 2' అవకాశాన్ని ఎంపిక చేసుకున్నాడని, దీనికి కలత చెందిన వ్యక్తులు ఈ పుకార్లు సృష్టించారని కూడా సునీల్ శెట్టి అన్నారు. నా భోజనాన్ని కూడా నేను సెట్స్ కి తెచ్చుకుంటాను. నిర్మాతకు అదనపు భారం కాను. అలాంటిది నా వారసుడు ఎలా పెరిగాడో మీరు ఊహిస్తారా? అని కూడా సునీల్ శెట్టి ఆవేదన చెందారు. మొత్తానికి సునీల్ శెట్టి అంతటి పెద్ద స్టార్ ఇలా వాపోవడం చూస్తుంటే, బాలీవుడ్ లో కుట్రలు కుతంత్రాలతో వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక స్టార్ కిడ్ కి ఇలాంటి పరిస్థితి ఉంటే, ఔట్ సైడర్ అయితే సీన్ ఎలా ఉంటుందో ఊహించగలం.
