సూర్య సినిమాలోని ఆ నటుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన సక్సెస్ ఈజీగా దక్కుతుందని చెప్పలేం.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2026 3:27 PM ISTసినీ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన సక్సెస్ ఈజీగా దక్కుతుందని చెప్పలేం. వారసత్వం వల్ల మంచి ఇంట్రడక్షన్ లభించొచ్చు.. కానీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించాలంటే మాత్రం సొంత టాలెంట్ అవసరం. ఇప్పుడు అలాంటి ప్రయాణాన్నే కొనసాగిస్తున్న నటుల్లో సునీల్ రెడ్డి ఒకరు. తాజాగా సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ లో కనిపించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆయనకు చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సునీల్ రెడ్డి మరెవరో కాదు, ప్రముఖ స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు.
కోదండరామిరెడ్డి పేరు తెలుగు సినీ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనది. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రి వంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను అందించిన ఆయన.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సునీల్ మాత్రం తండ్రి ఇమేజ్‌ను ఆధారంగా చేసుకుని హీరోగా తెరపైకి రావాలనే మార్గాన్ని ఎంచుకోలేదు.
2018లో విజయ్ సేతుపతి నటించిన సీతాకత్తి మూవీతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సునీల్, తమిళ సినిమాల్లో చిన్న పాత్రలు, కామెడీ క్యారెక్టర్లతో క్రమంగా తన ఉనికిని చాటుకున్నారు. డాక్టర్, బీస్ట్, జైలర్, మామన్నన్ వంటి సినిమాల్లో కనిపిస్తూ తమిళ ఆడియన్స్ కు పరిచయమయ్యారు. పాత్ర నిడివి కంటే.. తెరపై కనిపించినప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తుండిపోవడమే ఆయన బలంగా మారింది.
తెలుగులోనూ తన కెరీర్‌ను నెమ్మదిగా విస్తరించుకుంటున్నారు సునీల్. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, విశ్వనాథ్ అండ్ సన్స్ ఆయనకు మరింత విస్తృతమైన గుర్తింపును తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. సూర్యకు బావ పాత్రలో కనిపించిన ఆయన.. సినిమాలో తన కామెడీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఈ నటుడి గురించి తెలుగు ఆడియన్స్ కూడా తెలుసుకోవడం మొదలుపెట్టారు.
మరోవైపు, సునీల్ తమ్ముడు వైభవ్ తమిళంలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తమ కెరీర్‌ను తమకు నచ్చిన దారిలో నిర్మించుకోవడం విశేషం. అందుకే సునీల్ రెడ్డి కథను కేవలం స్టార్ డైరెక్టర్ కొడుకు అనే ట్యాగ్‌తో చూడలేం. ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఆయనకు ఇండస్ట్రీలోకి తలుపులు తెరిచినప్పటికీ, ఆ తలుపుల లోపల తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం సునీల్ తన యాక్టింగ్ తోనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ తో వచ్చిన కొత్త గుర్తింపు ఆయన కెరీర్‌కు మరో మెట్టు అవుతుందేమో చూడాలి.
