ఏషియన్ నారంగ్ పదవికి రాజీనామా.. పవన్ అపాయింట్‌మెంట్ వెనక!
ఇదే సమయంలో ఇండస్ట్రీ వర్గాలలో కొందరు ఆయనను `పెద్ది` రిలీజ్‌కు వ్యతిరేకంగా వెళ్లమని ఒత్తిడి తెచ్చారని ప్రచారం సాగింది.
By: Tupaki Desk | 30 May 2026 8:38 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల పర్సెంటేజ్ సిస్టమ్ - ఎగ్జిబిటర్ల సమస్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కం ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పరిశ్రమలోని తాజా వివాదాలపై ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ముఖ్యంగా తాను తెలంగాణ ఫిలిం చాంబర్ (టిఎఫ్‌సిసి) ప్రెసిడెంట్ పదవి నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడానికి గల అసలు కారణాలేమిటో ఆయన రివీల్ చేసారు.
సునీల్ నారంగ్ తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు ఇండస్ట్రీలోని అభిప్రాయ భేదాలు.. తన మానసిక ప్రశాంతత - ఆరోగ్యం ముఖ్యం అని భావించడమేనని సమాధానమిచ్చారు. తాను చాంబర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రకరకాల వ్యక్తుల నుండి ``అది చేయి.. ఇది చేయి`` అంటూ విపరీతమైన ఫోన్ కాల్స్, ఒత్తిళ్లు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. కొన్ని కీలక విషయాలలో అవతలి వర్గం వారు తమతో ఏకీభవించనప్పుడు అనవసరమైన ఘర్షణలు తలెత్తేవని.. దానివల్ల తీవ్రమైన కోపం రావడం.. బీపీ (రక్తపోటు) పెరగడం వంటి మానసిక ఆందోళనలు ఎదురయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకు అనవసరంగా సమయాన్ని, శక్తిని వృథా చేసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం ఇష్టం లేకనే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఇండస్ట్రీ వర్గాలలో కొందరు ఆయనను `పెద్ది` రిలీజ్‌కు వ్యతిరేకంగా వెళ్లమని ఒత్తిడి తెచ్చారని ప్రచారం సాగింది. ఈ విషయంలో చిరంజీవి గారిని ఎదిరించలేకనే నారంగ్ రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనకు ఎవ్వరూ అలా చెప్పలేదని.. తాను ఎవరి మాట వినే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. చిరంజీవితో జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్‌కు తాను హాజరైన మాట నిజమే అయినా.. అక్కడ తాను ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా కేవలం అందరితో పాటు కూర్చుని ఉన్నానని వెల్లడించారు. సెక్రటరీ శ్రీధర్ టీవీలో ఎగ్జిబిటర్ల బాధలను వ్యక్తపరిచినందువల్లనే పెద్ద మనిషిగా చిరంజీవి గారు పిలిపించి మాట్లాడారని.. తామంతా వెళ్లి కేవలం మర్యాదపూర్వకంగా `హలో.. బై` అని మాత్రమే చెప్పామని.. సినిమా గురించి ఎలాంటి చర్చలు జరపలేదని.. బయట వస్తున్నవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు.
మరోవైపు తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడం చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు అజెండాను సునీల్ నారంగ్ బయటపెట్టారు. ఇండస్ట్రీకి చెందిన నలుగురైదుగురు వ్యక్తులు పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి తమ గురించి, చాంబర్ వ్యవహారాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని నారంగ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ గారికి తమపై ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను క్లారిఫై చేయడానికే తాము అధికారికంగా చాంబర్ తరపున అపాయింట్‌మెంట్ అడిగామని నారంగ్ స్పష్టం చేశారు.
అంతిమంగా.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వివాదాల విషయంలో ఇరువైపులా ఉన్న లాభనష్టాలను పవన్ కల్యాణ్ గారికి కూలంకషంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సునీల్ నారంగ్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ని తాము కేవలం `ఆంధ్రా డిప్యూటీ సీఎం` అనే రాజకీయ కోణంలో లేదా వేరే ప్రాంతపు వ్యక్తిగా చూడటం లేదని.. సినిమా ఇండస్ట్రీ పరంగా `ఆయన మన మనిషి` అని ఎంతో ఆత్మీయంగా పేర్కొన్నారు. అందుకే తమ వెర్షన్‌ను కూడా ఆయనకు స్పష్టంగా వివరించి పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి పారదర్శకమైన క్లారిటీ ఇవ్వడానికే తాము ఈ భేటీకి సిద్ధమవుతున్నట్లు ఏషియన్ నారంగ్ తన ఇంటర్వ్యూను ముగించారు.
