నన్ను ఇడ్లీ వడ అమ్ముకోమన్నారు: స్టార్ హీరో
ఈ విషయాలన్నిటినీ గుర్తు చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అతడు తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
By: Tupaki Desk | 13 May 2025 1:30 AMజీవితంలో ఏదైనా సాధించడం అంత సులువు కాదు. చాలా శ్రమిస్తేనే, ఉన్నత స్థానానికి ఎదిగేందుకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం కోసం అతడు చాలా అవమానాల్ని ఎదుర్కొన్నాడు. అతడు నటించిన తొలి రెండు సినిమాలు విడుదల కాలేదు. మూడో సినిమా హిట్టయింది. కానీ తనను నటనకు పనికి రావని విమర్శించారు. తన లుక్స్ గురించి, నట ప్రదర్శన గురించి విమర్శించారు. ఒక విమర్శకుడు అయితే ఇడ్లీ వడ అమ్ముకోమనండి! అని విమర్శించాడు.
ఈ విషయాలన్నిటినీ గుర్తు చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అతడు తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాను నటుడిగా పనికి రానని ఒక విమర్శకుడు అన్నాడని తెలిపారు. తన ప్రారంభ చిత్రాలు ఫౌలాద్, ఆర్జూ నిర్మాణ సమస్యల కారణంగా వాయిదా పడ్డాయని సునీల్ శెట్టి చెప్పారు. అర్జూ కోసం 65 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాను. దాదాపు పూర్తయింది.
కానీ దర్శకనిర్మాతల మధ్య వివాదం కారణంగా వాయిదా పడిపోయింది. ఫౌలాద్ సినిమాను పరిశీలిస్తున్నప్పుడు దర్శకుడు డేవిడ్ ధావన్ అది సునీల్ కెరీర్ కు ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెందాడు. ఫలితంగా ఆ సినిమా కూడా ఆగిపోయింది. మూడో ప్రయత్నం 'బల్వాన్' సక్సెసైంది. ఇందులో సునీల్ సరసన దివ్యభారతి కథానాయిక. బల్వాన్ బ్లాక్ బస్టర్ అయినా తన నటనకు వంకలు పెట్టారు. తన లుక్ ని ఎగతాళి చేసారని సునీల్ గుర్తు చేసుకున్నాడు. అతడికి నటించడం తెలియదు.. ఎలా నడవాలో తెలియదు.. శరీరం దృఢంగా ఉంది. ఇడ్లీ వడ అమ్ముకోమనండి అని అన్నారట.
అతడు ఎగతాళి చేస్తున్నాడని అర్థమైంది. కానీ ఆ ఇడ్లీ-వడ వ్యాపారం నా వెన్నెముక. అది నా సోదరీమణులకు, నాకు విద్యను అందించింది. బహుశా ఆ రకమైన పెంపకం లేని వారి కంటే చాలా బాగా మెరుగయ్యేలా చేసిందని అన్నాడు. ''నేను టేబుల్స్ శుభ్రం చేసేవాడిని.. కౌంటర్ వద్ద సేవ చేసేవాడిని.. వంటగదిలో నిలబడేవాడిని. అయితే ఏంటి? నేను అప్పుడు సునీల్ శెట్టిని.. ఇప్పుడు నేను సునీల్ శెట్టినే!'' అని అన్నాడు. సునీల్ శెట్టి ఇటీవల రజనీకాంత్ దర్బార్ లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించాడు. ఇటీవల సౌత్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటిస్తున్నాడు.