మామ అల్లుళ్లు 10కోట్లతో జాయింట్ వెంచర్
ఈ సెలబ్రిటీ మామా అల్లుళ్లు ముంబైను ఆనుకుని ప్రధాన ఏరియాలో 10కోట్ల ధరకు ఏడెకరాలు కొనుగోలు చేసారు.
By: Tupaki Desk | 16 April 2025 11:04 AM ISTఈ సెలబ్రిటీ మామా అల్లుళ్లు ముంబైను ఆనుకుని ప్రధాన ఏరియాలో 10కోట్ల ధరకు ఏడెకరాలు కొనుగోలు చేసారు. ఈ ఏడెకరాలు పదేళ్లలో 50కోట్లు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. అభివృద్ధికి చేరువలో ఉన్న ఔట్ స్క్రర్ట్స్ ఇన్వెస్టిమెంట్ కావడంతో ఈ డీల్‌పై చాలా చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరీ మామా అల్లుళ్లు అంటే? వివరాల్లోకి వెళ్లాలి.
భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ - బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి అల్లుడు అన్న సంగతి తెలిసిందే. శెట్టి కుమార్తె ఆథియాను రాహుల్ పెళ్లాడాడు. ఈ జంటకు ఒక బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సునీల్-రాహుల్ జోడీ సంయుక్తంగా థానే వెస్ట్‌లోని ఓవాలేలో 7 ఎకరాల భూమిని రూ.9.85 కోట్లకు కొనుగోలు చేశారు. మార్చి 2025లో నమోదైన ఈ లావాదేవీ వివరాల ప్రకారం... 30 ఎకరాల 17-గుంటల పెద్ద ప్లాట్‌లో ఈ ఏడెకరాలు భాగం అని తెలుస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ ఒప్పందాన్ని ధృవీకరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెడుతూ ఆర్జిస్తున్న సెలబ్రిటీల మనస్తత్వానికి ఇది అద్దం పడుతుంది. ఈ లావాదేవీలో రూ.68.96 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి.
ఈ ఆస్తి ఘోడ్బందర్ రోడ్డు సమీపంలో థానే వెస్ట్‌లో ఉన్న ఓవాలే, ఆనంద్ నగర్, కాసర్వాడవాలి మధ్య ఉంది. ఇది ఘాడ్బందర్ రోడ్డు వెంబడి విస్తరించి ఉంది. థానే వెస్ట్‌ను తూర్పు పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేలకు అనుసంధానించే కీలక మార్గం. ఈ ప్రధాన స్థానం థానే, ముంబై, పశ్చిమ శివారు ప్రాంతాలలోని ప్రధాన వ్యాపార కేంద్రాలకు అనువుగా మారుతోంది. సునీల్ శెట్టి- కె.ఎల్.రాహుల్ ఎంపిక ఆ ప్రాంతంలోని భవిష్యత్ అభివృద్ధిని సూచిస్తోంది. జూలై 2024లో కె.ఎల్. రాహుల్ అతడి భార్య అతియా శెట్టి, బాంద్రాలోని పాలి హిల్‌లో రూ.20 కోట్లకు 3,350 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. అదే సమయంలో సునీల్ శెట్టి అతడి కుమారుడు అహన్ శెట్టి ఖార్ ప్రాంతంలో రూ.8.01 కోట్లకు 1,200 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు.
కె.ఎల్.రాహుల్ భారత క్రికెట్ టీమ్ లో స్థిరమైన ఆటగాడిగా పాపులరయ్యారు. ఆథియా శెట్టి ప్రస్తుతానికి నటనకు విరామం ఇచ్చారు. సునీల్ శెట్టి సీనియర్ నటుడు, వ్యవస్థాపకుడు. 100 కి పైగా చిత్రాలలో నటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ అవార్డును అందుకున్నారు. నటనకు మించి శెట్టి ఫిట్‌నెస్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాలలో తనదైన ముద్ర వేశారు. వినోద పరిశ్రమ వెలుపల భారీ బిజినెస్ లతో స్థిరపడ్డారు.
