TFCCకి సునీల్ నారంగ్ రాజీనామా వెనక ఏం జరిగింది?
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
By: Tupaki Desk | 9 Jun 2025 12:49 PM ISTతెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో TFCCకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించిన విషయం తెలిసిందే. మూడవ సారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15 మంది ఎగ్జిక్యుటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సునీల్ నారంగ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయన్నారు. హీరోలు దేవుళ్ల లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ చేయరన్నారు. అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ తుపాను లాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికీ లేదన్నారు.
అయితే ఆదివారం అనూహ్యంగా సునీల్ నారంగ్ TFCC అధ్యక్ష పదవికి రాజీనామ చేయడం సంచలనం సృష్టిస్తోంది. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన పేర్కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని, ఇలాంటి పరిస్థితుల్లో అథ్యక్షుడిగా కొనసాగలేనని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొనడంతో అసలు చర్చ మొదలైంది.
ఇంతకీ సునీల్ నారంగ్‌కు తెలియకుండా ప్రకటనలు చేస్తున్నది ఎవరు? ఇటీవల జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్‌లో ఆయన ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక ఉన్నది ఎవరు? తన కారణంగానే మనస్తాపానికి గురైన సునీల్ నారంగ్ TFCC అధ్యక్ష పదవికి 24 గంటలు తిరక్కుండానే రాజీనామా చేశారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ఇండస్ట్రీలో సునీల్ నారంగ్‌కు మంచి పేరుంది. ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతగా కూడా ఆయన కొనసాగుతున్నారు.
ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రవితేజ ఆయనతో కలిసి థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. ఏషియన్ మాల్స్‌కు ప్రధాన వాటాదారుగా, నిర్మాతగా మంచి పేరున్న సునీల్ నారంగ్‌ని టార్గెట్ చేసింది ఎవరు? దాని వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం ఏంటీ? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.
