Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ లైనప్.. అదిరిపోయిందిగా!

ప్రస్తుతం ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. మిగతా భాషల మూవీల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2024 1:01 PM GMT
సందీప్ కిషన్ లైనప్.. అదిరిపోయిందిగా!
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న హీరోల్లో యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఒకరు. ప్రస్థానం మూవీలో నెగిటివ్ రోల్ తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో.. స్నేహ గీతం చిత్రంతో హీరోగా మారారు. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సోలో హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. మిగతా భాషల మూవీల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు.

అయితే సందీప్ కిషన్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ మూవీ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో స్పెషల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. గట్టి కమ్ ఇవ్వాలని కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న సందీప్ కిషన్.. గత నెలలో ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఫాంటసీ థ్రిల్లర్ గా థియేటర్లలో విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ.. బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని అందుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా ఇటీవల ఓటీటీలోకి వచ్చి సత్తా చాటుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. స్ట్రీమింగ్ అయిన 24 గంటల్లోనే నేషనల్ వైడ్‍ ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చి అలరిస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు సందీప్ కిషన్ లైనప్ పై అందరి దృష్టి పడింది. స్పెషల్ కేరింగ్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు ఈ హీరో. అందులో ఒకటి ఇప్పటికే సెట్స్ పై ఉండగా.. మరో మూడు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం సందీప్ తమిళ- తెలుగు ద్విభాషా చిత్రం మాయావన్ షూటింగ్‌ ను పూర్తి చేస్తున్నారు. 2017లో వచ్చిన మాయావన్/ ప్రాజెక్ట్-జెడ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక మరో రెండు రోజుల్లో సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రానుంది. ధమాకా మూవీ దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు యంగ్ హీరో. దీంతోపాటు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ RJ స్వరూప్ తో కలిసి పని చేయనున్నారు. వీరి కాంబోలో కంప్లీట్ లవ్ స్టోరీ తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.

అయితే ఈ మూడు సినిమాలు కాకుండా.. సూపర్ హిట్ ఫ్రాంచైజీ ది ఫ్యామిలీ మ్యాన్ లో సందీప్ కిషన్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. మూడో పార్ట్ లో సందీప్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ కమాండర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మరి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ కుర్ర హీరో.. ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.