Begin typing your search above and press return to search.

'వైబ్' ఫస్ట్ లుక్: యాక్షన్ అవతార్‌లో సందీప్ కిషన్!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా కాలం తర్వాత 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 9:36 AM GMT
వైబ్ ఫస్ట్ లుక్: యాక్షన్ అవతార్‌లో సందీప్ కిషన్!
X

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా కాలం తర్వాత 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ జోష్ లో బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. 'కెప్టెన్ మిల్లర్' తరువాత ధనుష్ తో కలిసి 'రాయన్' అనే చిత్రంలో నటిస్తున్న సందీప్.. తాజాగా తన 31వ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈరోజు శనివారం #SK31 సినిమా టైటిల్‌ తో పాటుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.


సందీప్ కిషన్ తన నెక్స్ట్ మూవీ కోసం సెన్సేషనల్ హిట్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మేకర్స్ తో చేతులు కలిపారు. టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ RSJ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "VIBE" (వైబ్) అనే ఆసక్తికరమైన ఇంగ్లీష్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా టైటిల్ లోగో హ్యాండ్ పంచ్‌గా డిజైన్ చేయబడింది.

సందీప్ కిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "యుద్ధం ఎంత పెద్దది అయినా సరే చుట్టూ నలుగురు స్నేహితులు తోడు ఉంటే చాలు గెలుపు నీదే మిత్రమా. నా ఇద్దరు స్నేహితులు స్వరూప్, రాహుల్ యాదవ్. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' లాంటి సినిమాలు పని చేసిన ఇన్క్రెడిబుల్లీ టాలెంటెడ్ & ప్యాషనేట్ టీమ్‌తో నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. మీకు క్రేజీ నోస్టాల్జిక్ వైబ్ ను అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షేర్ చేసిన యాక్షన్ ప్యాక్‌డ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

'వైబ్' ఫస్ట్ లుక్‌ పోస్టర్ లో సందీప్ కిషన్ వైల్డ్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. ఇందులో అతనితో పాటుగా అల్లర్లలో పాల్గొన్న ఫ్రెండ్స్ గ్యాంగ్ ను కూడా మనం చూడవచ్చు. సందీప్ ఒక చేతిలో రక్తంలో తడిసిన కత్తిని, మరో చేతిలో నిప్పులతో ఉన్న సోడా బాటిల్ ను పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్న అతని స్నేహితులు కూడా, ఆయుధాలు పట్టుకుని ఎవరి మీదకో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

“VIBE” అనేది కాలేజ్ బేస్డ్ యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. భారీ యాక్షన్‌తో పాటు, కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పరిస్థితుల కారణంగా హింసాత్మక మార్గాన్ని అనుసరించే ఒక కాలేజీ స్టూడెంట్ గ్యాంగ్ కథను ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి కమర్షియల్ హంగులతో కూడిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. మరోవైపు డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జె తనదైన శైలిలో థ్రిల్లర్‌లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ తో చేస్తున్న "వైబ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరిలో మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ చిత్రాన్ని 2025 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.