Begin typing your search above and press return to search.

సూర్య సినిమా చూసి కెరీర్ మార్చుకున్న టాలీవుడ్ హీరో

సందీప్ కిషన్ మొదట్లో ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాలనుకునేవాడని, పోలీస్ వృత్తిపై తనకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ ఉండేదని చెప్పారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Aug 2026 1:33 PM IST
సూర్య సినిమా చూసి కెరీర్ మార్చుకున్న టాలీవుడ్ హీరో
X

టాలీవుడ్ న‌టుడు సందీప్ కిషన్ యాక్ట‌ర్ గా మారడానికి తీసుకున్న నిర్ణయం వెనుక సూర్య, అల్లు అర్జున్ సినిమాలు కీలక పాత్ర పోషించాయనే విషయం తాజాగా ఆయన వెల్లడించిన కామెంట్స్ తో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా నటీనటులు తమ కెరీర్‌ను ప్రభావితం చేసిన డైరెక్ట‌ర్లు లేదా వ్యక్తుల గురించి మాట్లాడుతుంటారు. కానీ సందీప్ చెప్పిన కథలో స్పెషాలిటీ ఏంటంటే, రెండు సినిమాలు ఆయనకు రెండు వేర్వేరు సమాధానాలు ఇచ్చాయి. అందులో ఒకటి తన నిజమైన కల ఏమిటో క్లారిటీ ఇవ్వగా, మరొకటి ఆ కలను నిజం చేయగలమనే నమ్మకాన్ని కలిగించింద‌ని సందీప్ చెప్పారు.

సందీప్ కిషన్ మొదట్లో ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాలనుకునేవాడని, పోలీస్ వృత్తిపై తనకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ ఉండేదని చెప్పారు. ఆ ఇంట్రెస్ట్ ను సూర్య న‌టించిన ఖాఖా ఖాఖా సినిమా మరింత బలపరిచింద‌ని కూడా సందీప్ చెప్పారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఆ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించిన తీరు తనపై గాఢమైన ప్రభావం చూపిందని సందీప్ గుర్తు చేసుకున్నారు. అయితే అదే సినిమా మళ్లీ చూసిన తర్వాత తనకు త‌న లైఫ్ పై ఒక క్లారిటీ వచ్చిందని కూడా చెప్పారు. పోలీస్ అవ్వాలనిపించినా, వాస్తవానికి తాను సినిమాల్లోనే జీవించాలనుకుంటున్నానని, నటుడిగా మారడమే తన అసలైన కల అని అప్పుడే క్లారిటీ వ‌చ్చింద‌ని వెల్లడించారు.

ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ కలను సీరియస్‌గా తీసుకునే ధైర్యం మాత్రం వెంటనే రాలేద‌ని, ఆ టైమ్ లో అల్లు అర్జున్ నటించిన ఆర్య తన ఆలోచనలను మరో స్థాయికి తీసుకెళ్లిందని సందీప్ చెప్పారు. మంచి కథతో వచ్చిన కొత్త తరహా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని స‌క్సెస్ సాధించడం తనకు పెద్ద ఇన్సిపిరేష‌న్ గా మారిందని సందీప్ పేర్కొన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, సరైన కథను ఎంచుకుంటే కొత్తవాళ్లు కూడా స‌క్సెస్ ను అందుకోవచ్చనే నమ్మకం ఆర్య సినిమా ద్వారా కలిగిందని వివరించారు.

ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ జర్నీని చూస్తే, ఖాఖా ఖాఖా ఆయనకు దిశ చూపిన సినిమాగా నిల‌వ‌గా, ఆర్య ఆ దిశలో నడిచే ధైర్యం ఇచ్చిన సినిమాగా నిలిచింది. ఒకటి తన కలను గుర్తు చేస్తే, మరొకటి ఆ కల సాధ్యమేననే విశ్వాసాన్ని ఇచ్చింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్స్, కెరీర్ డెసిష‌న్స్, ఆశయాలపై సినిమాల ప్రభావం ఎంత బలంగా ఉండగలదో సందీప్ కిషన్ ఎక్స్‌పీరియెన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఆయన విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన సిగ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.