Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సుందరం మాస్టార్

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:06 PM GMT
మూవీ రివ్యూ : సుందరం మాస్టార్
X

'సుందరం మాస్టార్' మూవీ రివ్యూ

నటీనటులు: హర్ష చెముడు-దివ్య శ్రీపాద- హర్షవర్ధన్-బాలకృష్ణ-భద్రం తదితరులు

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

ఛాయాగ్రహణం: దీపక్ యెరెగడ

నిర్మాతలు: రవితేజ-సుధీర్ కుమార్

రచన-దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్

యూట్యూబ్ షార్ట్ 'వైవా'తో మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా స్థిరపడ్డ నటుడు హర్ష చెముడు. ఇప్పుడతను కథానాయకుడిగా మారాడు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ సినిమా.. సుందరం మాస్టర్. వెరైటీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సుందరం (హర్ష చెముడు) ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడికి మంచి కట్నం వచ్చే పెళ్లి సంబంధం చేసుకోవాలని ఆశ. అందుకోసం డీఈవో కావాలనుకుంటాడు. ఐతే తన కోసం ఓ పని చేసి పెడితే అతణ్ని డీఈవోని చేస్తానని మాట ఇస్తాడు ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్). అతను చెప్పిన ప్రకారం మిర్యాల మెట్ట అనే ఊరికి ఇంగ్లిష్ టీచర్ గా వెళ్లి అక్కడున్న ఓ విలువైన వస్తువు కోసం వెదుకులాట మొదలుపెడతాడు. ఐతే మిర్యాలమిట్టలో చిత్రంగా మాట్లాడే.. ప్రవర్తించే మనుషుల మధ్య సుందరం నానా తంటాలు పడతాడు. ఇంతకీ అతను వెదుకుతున్న విలువైన వస్తువేంటి.. అక్కడి మనుషులను మాయ చేసి ఆ వస్తువును సుందరం తీసుకురాగలిగాడా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

క‌థ‌నం-విశ్లేష‌ణ:

ఒక‌ టీజ‌ర్ లేదా ట్రైల‌ర్ చూసిన‌పుడు.. అందులో ఏదైనా కొత్త ఐడియా క‌నిపిస్తే.. క్రేజీ సీన్లు తార‌స‌డితే ప్రేక్ష‌కుల్లో ఒక క్యూరియాసిటీ ఏర్ప‌డుతుంది. మూస సినిమాల వ‌ర‌ద‌లో కొట్టుకుపోతున్న ఆడియ‌న్స్ ఇదేదో కొత్త‌గా ఉందే అని ఆశ‌గా ఆ సినిమా వైపు చూస్తారు. ఐతే ప్రోమోల వ‌రకు క్రేజీ సీన్లు పెట్టి థియేట‌ర్ల వ‌ర‌కు తీసుకురావ‌డం బాగానే ఉంటుంది కానీ.. ఆ కొత్త ఐడియాను ఆస‌క్తిక‌రంగా.. క‌న్విన్సింగ్ గా తెర‌పై ప్రెజెంట్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించేవాళ్లు కొంత‌మందే. సుంద‌రం మాస్టర్ టీజ‌ర్.. ట్రైల‌ర్ల‌లో అంద‌రినీ ఆక‌ట్టుకుంది అడ‌విలో ఉండే గూడెం జ‌నాలు పోష్ ఇంగ్లిష్ మాట్లాడుతూ.. హీరో వైవా హ‌ర్ష‌కు షాకులిచ్చే స‌న్నివేశాలే. సినిమాలో కూడా ఈ సీన్ల వ‌ర‌కు ఓ మోస్త‌రుగా న‌వ్విస్తాయే త‌ప్ప‌.. వాటిని దాటి సినిమాలో ఏముందా అని చూస్తే శూన్య హ‌స్త‌మే మిగిలింది. అస‌లు ప్రోమోల్లో హైలైట్ అయిన విష‌యాల‌ను తెర‌పై క‌న్విన్సింగ్ గా చెప్ప‌డంలోనే చిత్ర బృందం విఫ‌ల‌మైంది. అస్స‌లు లాజిక్ లేకుండా.. ఒక ద‌శా దిశా లేకుండా సాగిపోయే సుంద‌రం మాస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నాడ‌న్న‌దే అర్థం కాదు.

హీరో ఒక గూడెంలో ఏదో విలువైన వ‌స్తువు ఉంద‌ని దాని గురించి తెలుసుకునే మిష‌న్ మీద అక్క‌డికి వెళ్తే అక్క‌డి జ‌నాలు ఎంత అమాయ‌కంగా ఉంటారంటే.. క‌నీసం దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన విష‌యం కూడా వాళ్ల‌కు తెలియ‌దు. కానీ అదే జ‌నాలు పోష్ ఇంగ్లిష్ మాట్లాడుతూ.. ఇంగ్లిష్ టీచ‌ర్ అయిన హీరోను కంగారు పెట్టేస్తుంటారు. గూడెం జ‌నాలు ఫారిన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడుతుంటే విన‌డానికి గ‌మ్మ‌త్తుగా అనిపిస్తుంది. హీరోకు ఇంగ్లిష్ లోనే పంచులు వేస్తుంటే స‌ర‌దాగా అనిపిస్తుంది. కానీ అస‌లు వాళ్లు అంత బాగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడుతున్నారు అన‌డానికి క‌న్విన్సింగ్ రీజ‌న్ కూడా చూపించ‌లేక‌పోయాడు హీరో ఆ గూడానికి వెళ్ల‌డానికి చూపించిన కార‌ణం స‌హా సినిమాలో చూపించిన చాలా విష‌యాలు క‌న్విన్సింగ్ గా అనిపించ‌వు. చాలా సీన్లు ఇల్లాజిక‌ల్ గా సాగుతుంటాయి.

కామెడీలో లాజిక్ లు వెత‌క‌లేం కానీ.. క‌థ‌లోనే లాజిక్ లేక‌పోతే అందులో ఇన్వాల్వ్ కావ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. హీరో వెళ్లిన గూడెంలో ఉండే జ‌నాలే ఓ 30 మందికి మించి క‌నిపించ‌రు. అంత త‌క్కువ‌మందిలో ఓ మ‌నిషి పోతే.. ఎవ్వ‌రి కంట్లోనూ నీళ్లు రావు. పైగా ఆ చ‌నిపోయిన వ్య‌క్తి ఇద్ద‌రు భార్య‌లు స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఎపిసోడ్లో అంద‌రూ పోవాల్సిన వాళ్లే క‌దా అని ఒక పాత్ర‌తో వేదాంతం చెప్పించ‌డం బాగానే ఉంది.. కానీ మ‌నిషి పోతే క‌నీసం బాధ ప‌డ‌కుండా గూడెంలోని జ‌న‌మంతా స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెప్పుకుంటూ అంత్య‌క్రియల‌య్యాక న‌వ్వుకుంటూ భోజ‌నాలు చేయ‌డం మ‌రీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఇలా విడ్డూరంగా అనిపించే సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయి.

ఇంగ్లిష్ టీచ‌ర్ కావాల‌ని గూడెం జ‌నాలు మంత్రికి లేఖ రాయ‌డం ఏంటో.. ఆ మంత్రి అక్క‌డేదో అద్భుతం ఉన్నట్లు హీరోను మిష‌న్ మీద గూడేనికి పంప‌డం ఏంటో.. ఆ గూడెం జ‌నాలు త‌మ‌కు పాఠాలు చెప్ప‌డానికి వ‌చ్చిన హీరోకు ఇంగ్లిష్ టెస్టు పెట్ట‌డం ఏంటో.. ఫెయిలైతే ఉరి వేస్తాం అన‌డం ఏంటో.. ఇలా అన్నీ చిత్ర విచిత్రంగా అనిపించే స‌న్నివేశాలే సినిమా నిండా. ఎక్క‌డా ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ ఉండ‌దు. స‌న్నివేశాల్లో బ‌లం క‌నిపించ‌దు. హీరో పెద్ద మిష‌న్ లాగా ఫీలై విగ్ర‌హాన్ని క‌నిపెట్ట‌డం కోసం చేసే ప‌రిశోధ‌న‌.. దాన్ని మంత్రికి చేర్చ‌డం చుట్టూ జ‌రిగే డ్రామా గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప‌తాక స‌న్నివేశాల్లో అయినా ఏమైనా ఇంటెన్సిటీ పెరుగుతుంద‌నుకుంటే అలాంటిదేమీ జ‌ర‌గ‌దు. ఒక స‌న్నివేశానికి ఇంకో స‌న్నివేశానికి లింక్ లేన‌ట్లు క‌థ ఎటెటో తిరిగిపోతుంటుంది. మ‌రీ పేల‌వ‌మైన ముగింపుతో సినిమా గ్రాఫ్ ఇంకా ప‌డిపోతుంది. గూడెం జ‌నాల అమాయ‌క‌త్వం.. వాళ్ల ఇంగ్లిష్ టాలెంట్ చుట్టూ న‌డిపిన కొన్ని సీన్ల‌లో కామెడీ కొంత వ‌ర్క‌వుట్ అయింది త‌ప్ప సుంద‌రం మాస్టర్ లో అంత‌కుమించి చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు.

న‌టీన‌టులు:

సుంద‌రం మాస్ట‌ర్ పాత్ర‌లో హ‌ర్ష మంచి ఈజ్ తో న‌టించాడు. తన ఆహార్యం.. న‌ట‌న ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లు ఉన్నాయి. హీరో అనే ఫీలింగ్ లేకుండా త‌న‌కు అల‌వాటైన కామెడీ పాత్ర‌లు చేసిన‌ట్లే ఈ పాత్ర‌ను కూడా చేశాడ‌త‌ను. దివ్య శ్రీపాద పాత్ర గంద‌ర‌గోళంగా అనిపించినా.. ఆమె లుక్స్.. న‌ట‌న బాగున్నాయి. ఆమె చూడ‌చ‌క్క‌గా అనిపిస్తుంది. హ‌ర్ష‌వ‌ర్ష‌న్ పాత్రలో ఏ విశేషం లేదు. ఆయ‌న త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డానికి ఈ పాత్ర ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. గూడెం ప్ర‌జ‌లుగా చేసిన వాళ్ల‌లో చాలామంది చాలా స‌హ‌జంగా న‌టించి మెప్పించారు. వాళ్లంద‌రిలో ఆయా పాత్ర‌ల‌కు అవ‌స‌ర‌మైన అమాయ‌క‌త్వం క‌నిపిస్తుంది. గూడెం పెద్ద‌గా చేసిన బాల‌కృష్ణ ఒక్క‌డే ఆ పాత్ర‌కు కొంచెం మిస్ ఫిట్ అనిపిస్తాడు. అందుకు ఆయ‌న ఇంత‌కుముందు చేసిన పాత్ర‌లు కూడా కార‌ణం కావ‌చ్చు.

సాంకేతిక వ‌ర్గం:

సుంద‌రం మాస్ట‌ర్ లో సాంకేతిక విలువ‌లు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. పాట‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేని సినిమాలో శ్రీ చ‌ర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతంతో ప్ర‌త్యేక‌త చాట‌డానికి ప్ర‌య‌త్నించాడు. స్కోర్ బాగానే సాగింది. దీప‌క్ యెరెగెడ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ సోసోగా అనిపిస్తాయి. బ‌డ్జెట్ ప‌రిమితులు క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ సంతోష్ ఒక డిఫ‌రెంట్ సినిమా తీయాల‌ని అనుకున్నాడు. ఐడియా వ‌ర‌కు బాగున్నా.. ఎగ్జిక్యూష‌న్లో తేలిపోయాడు. అక్క‌డ‌క్కడా కొంత న‌వ్వించ‌గ‌లిగినా.. క‌థ‌ను పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఏ ద‌శ‌లోనూ క‌థ‌లో ప్రేక్ష‌కుల‌ను ఇన్వాల్వ్ చేయించ‌లేక‌పోయాడు.

చివ‌ర‌గా: సుంద‌రం మాస్ట‌ర్.. ప‌ర‌మ బోర్

రేటింగ్ - 1.75/5