హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!
అంతేకాకుండా, "2025 మార్చిలో సినిమా పనులు ప్రారంభించాం. కథా చర్చలు, గ్రాఫిక్స్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది.
By: Priya Chowdhary Nuthalapti | 5 Nov 2026 9:45 AM ISTసినిమా ప్రపంచంలో రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో సినిమా నిర్మాణం పూర్తిగా మారిపోయేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ సాయంతో రూపొందిస్తున్న వీడియోలు చూస్తుంటే భవిష్యత్తులో అసలు షూటింగ్స్ లేకుండానే సినిమాలు తీసే రోజులు వస్తాయా అనే ఆసక్తి కలుగుతోంది.
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో రూపొందిస్తున్న వీడియోలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. స్టార్ హీరోలను విభిన్న పాత్రల్లో చూపించడం, ఒక హీరోను మరో సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లడం, కొత్త కథలకు సంబంధించిన సన్నివేశాలను సృష్టించడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో పనులు కంప్యూటర్ల ద్వారానే జరిగే అవకాశం ఉందనిపిస్తోంది.
ఇటీవల దర్శకుడు సుందర్ సి కూడా ఇదే విషయంపై ఆసక్తికరంగా స్పందించారు. ఆయన తెరకెక్కించిన మహాశక్తి..మూకుత్తి అమ్మన్ 2..సినిమా వీఎఫ్ఎక్స్పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, భవిష్యత్తులో షూటింగ్‌లు లేకుండానే సినిమాలు రూపొందించే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
"మహాశక్తి సినిమాలో 3,000కు పైగా సీజీఐ షాట్లు ఉన్నాయి. వాటిలో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ ఉపయోగించాం. మిగతా పనిని స్థానిక తమిళ టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పూర్తి చేశారు. సుమారు 800 మంది టెక్నీషియన్లు ఏడాదికి పైగా రేయింబవళ్లు శ్రమించి ఈ విజువల్స్‌ను సిద్ధం చేశారు. వారి కష్టాన్ని గుర్తించకుండా విమర్శలు చేయడం బాధ కలిగిస్తోంది" అని ఆయన అన్నారు.
అంతేకాకుండా, "2025 మార్చిలో సినిమా పనులు ప్రారంభించాం. కథా చర్చలు, గ్రాఫిక్స్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. సీజీ పనుల కోసం ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది. కానీ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో సంప్రదాయ షూటింగ్‌లు అవసరం లేకుండానే కంప్యూటర్ ముందు కూర్చొని సినిమాలు రూపొందించే రోజులు వస్తాయి. నటీనటులు తమ రూపం, గొంతును ఉపయోగించడానికి అనుమతి ఇస్తే చాలు. మిగతా సెట్టింగులు, సన్నివేశాలను ఏఐతోనే సృష్టించవచ్చు" అని సుందర్ సి వివరించారు.
ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే మాత్రం.. ఏఐ ప్రభావంతో సినిమా రంగంలో భారీ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు లేకుండానే సినిమాలు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, మనుషుల సృజనాత్మకతకు ఉండే ప్రత్యేకతను అది ఎంతవరకు భర్తీ చేయగలదో చూడాలి.
