Begin typing your search above and press return to search.

పాఠ‌శాల పాఠాల కంటే జీవిత పాఠాలే క‌ఠినం: స్టార్ కిడ్

తాగి తంద‌నాలాడ‌టం బావుంటుంది కానీ, ఆ త‌ర్వాత ప‌ర్య‌వ‌సానం మాత్రం క‌ఠినంగా ఉంటుంద‌ని వాపోయింది ప్ర‌ముఖ హీరో సోద‌రి.

By:  Tupaki Desk   |   8 May 2025 12:30 AM
పాఠ‌శాల పాఠాల కంటే జీవిత పాఠాలే క‌ఠినం: స్టార్ కిడ్
X

తాగి తంద‌నాలాడ‌టం బావుంటుంది కానీ, ఆ త‌ర్వాత ప‌ర్య‌వ‌సానం మాత్రం క‌ఠినంగా ఉంటుంద‌ని వాపోయింది ప్ర‌ముఖ హీరో సోద‌రి. తాగి తూలినంత సేపు బావున్న‌ట్టే అనిపిస్తుంది. రోజులు నెల‌లు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోతుంది. చివ‌రికి అది ఒక వ్య‌స‌నంగా మారిపోతుంది. ఆ త‌ర్వాత ఏదో ఒక రోజు దాని ప‌ర్య‌వ‌సానం తీవ్రంగా బాధిస్తుంద‌ని తెలిపింది స్వీయానుభ‌వంతో. తాను త‌ప్ప‌తాగి మంచం పై నుంచి కుర్చీ పైనుంచి కింద ప‌డిపోయేదానిని దెబ్బ‌లు తగిలి ఒంటిపై మార్కులు క‌నిపించేవ‌ని కూడా చెప్పింది.

ప్ర‌ముఖ నిర్మాత రాకేష్ రోష‌న్ కుమార్తె, పాపుల‌ర్ హీరో హృతిక్ రోష‌న్ సోద‌రి అయిన సునైనా రోష‌న్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న తాగుడు అల‌వాటు గురించి, అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి బ‌హిరంగంగా చెప్పుకొచ్చింది. తాను క్ష‌య‌- క్యాన్స‌ర్ లాంటి ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త‌ల‌తో ఏక‌కాలంలో పోరాడాన‌ని దాని కార‌ణంగా బాగా తాగుడుకు అల‌వాటు ప‌డిపోయాన‌ని సునైనా రోష‌న్ చెప్పింది. తాగుడు అనే చ‌క్రంలో ప‌డి దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయాన‌ని తెలిపింది. చివ‌రికి త‌న‌ను విదేశాల‌లోని పున‌రావాస కేంద్రానికి పంపాల్సిందిగా త‌నే స్వ‌యంగా త‌ల్లిదండ్రుల‌ను కోరిన‌ట్టు వెల్ల‌డించింది. భార‌త‌దేశంలో అయితే లంచ‌గొండులు .. డ‌బ్బు ఇస్తే మ‌ళ్లీ మందు బాటిల్ తెచ్చి ఇస్తారు. అందుకే విదేశాల‌కు పంపాల్సిందిగా కోరిన‌ట్టు తెలిపింది.

అయితే త‌న‌ను ఒక గ‌దిలో బంధించి కౌన్సిల‌ర్లు ప్ర‌శ్న‌ల‌తో విసిగించార‌ని, 28 రోజులు త‌న‌కు నిద్ర అన్న‌దే ప‌ట్ట‌లేద‌ని సునైనా తెలిపింది. కౌన్సిలింగ్ - చికిత్స స‌మ‌యంలో త‌న శ‌రీరం నుంచి అన్ని వ్య‌ర్థాల‌ను తొల‌గించార‌ని వెల్ల‌డించింది. చివ‌రికి పోరాడి అనుకున్న‌దానిని సాధించుకున్నాను. తాగుడు అనే రోగం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను అని తెలిపింది. తాగుడు మానే ద‌శ‌లో తీవ్ర ఆందోళ‌న‌, గుండె ద‌డ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని కూడా స్వీయానుభ‌వంతో సునైనా వెల్ల‌డించింది. అలాగే తాను పాఠ‌శాల‌కు వెళ్ల‌డాన్ని అస‌హ్యించుకున్నాన‌ని, కానీ వాస్త‌వ జీవితంలో సిస‌లైన‌ పాఠాలు నేర్చుకున్న‌న‌ని కూడా స్ప‌ష్ఠంగా చెప్పుకొచ్చింది. త‌న స్కూల్ డేస్ లో తాను సెల‌బ్రిటీ కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని స్పెష‌ల్ ట్రీట్ ఏదీ లేద‌ని, అప్ప‌టికి త‌న తండ్రి వ‌ద్ద ఏదీ లేద‌ని, న‌టుడిగా కానీ, నిర్మాత‌గా కానీ ఆయ‌న‌ అంత‌గా రాణించ‌లేద‌ని కూడా సునైనా తెలిపింది. ఎవరూ మమ్మల్ని స్టార్ పిల్లలుగా చూడలేదని వెల్ల‌డించింది. కానీ ఆ పాఠశాల తనకు జైలులా అనిపించిందని అన్నారు. అస‌హ్యించుకున్నాను.. పాఠాలు చ‌ద‌వ‌డంలో విఫ‌ల‌మ‌య్యాన‌ని తెలిపింది.