Begin typing your search above and press return to search.

సుమ ఎనర్జీ వెనక అసలు సీక్రెట్ ఏంటంటే?

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 May 2026 12:54 PM IST
సుమ ఎనర్జీ వెనక అసలు సీక్రెట్ ఏంటంటే?
X

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు రెండు దశాబ్దాలుగా రెగ్యుల‌ర్ టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, అవార్డు వేడుకలు అంటూ ఎక్కడ చూసినా సుమే కనిపిస్తుంటారు. స్టేజ్‌పై ఆమె ఎనర్జీ, టైమింగ్, హ్యూమర్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూసి ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమా ఈవెంట్ అంటే నిర్మాతలు ముందుగా హీరో డేట్స్ కంటే సుమ కాల్షీట్స్ చూసుకుంటారనే మాట ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తుంటుంది. అలాంటి సుమ తాజాగా తన ఎనర్జీ వెనకున్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమ తన వ్యక్తిగత జీవనశైలి, వర్క్ మేనేజ్‌మెంట్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఒక సాధారణ మహిళనే కానీ, తనపై ఉన్న బాధ్యతల కారణంగా అసాధారణంగా పని చేయాల్సి వస్తుందని సుమ తెలిపారు. రోజువారీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం తనకు అలవాటని, రేపటి పనుల కోసం ఈరోజే అలారమ్స్ పెట్టుకుంటానని చెప్పారు. అంతేకాదు, తాను చేసే పనుల్లో కొంత భాగాన్ని అసిస్టెంట్స్‌కు అప్పగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించారు. అన్ని పనులు తానే చేయాల‌నుకుంటే మనసు, శరీరం రెండూ అలసిపోతాయంటూ ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చకు దారి తీస్తున్నాయి.

అయితే సుమ చెప్పిన మరో విషయం మరింత ప్రేరణాత్మకంగా మారింది. త‌న‌తో చివరి వరకు ఉండేది త‌న‌ బాడీ మాత్రమేనంటూ ఆరోగ్యంపై తనకున్న అవగాహనను ఆమె వివరించారు. అందుకే బాడీ కోసం రెగ్యులర్‌గా జిమ్, యోగా, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని చెబుతూ, మెడిటేషన్ మరియు పర్సనాలిటీ ట్రైనింగ్ సెషన్స్‌కు కూడా హాజరవుతానని చెప్పారు. లేదంటే స్ట్రెస్ పెరిగి, క్రియేటివిటీ తగ్గిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రెగ్యుల‌ర్ గా కెమెరాల ముందుండే వ్యక్తులకు మెంటల్ ఫిట్‌నెస్ ఎంత అవసరమో సుమ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చెప్పిన ఈ మాటలను చాలామంది మోటివేషన్‌గా తీసుకుంటున్నారు.

ఇక ఇండస్ట్రీలో సుమకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో, నిర్మాతలు కూడా అంతే ఆసక్తిగా సుమ అందుబాటులో ఉందా అని ముందుగా చూసుకుంటారనే విష‌యాన్ని ఎంతో మంది చాలా ఓపెన్ గా చెప్పారు. ఎందుకంటే ఈవెంట్‌ను సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా, ఎక్కడా బోర్ కాకుండా ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఆమెకే ఉందని సినీ వర్గాలు భావిస్తాయి. అందుకే సుమ కేవలం యాంకర్ మాత్రమే కాదు, తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక బ్రాండ్‌గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.