టాప్ స్టోరి: భారీ అంచనాలతో పాన్ ఇండియా దర్శకులపై ఒత్తిడి
విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ విజయాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Sivaji Kontham | 29 April 2026 9:23 AM ISTప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో `పాన్ ఇండియా` అనేది కేవలం ఒక పదం కాదు.. అది ఊహకందనంత భారీ బాధ్యత. వందల కోట్ల బడ్జెట్లు.. వేల కోట్ల వసూళ్లే లక్ష్యంగా సినిమాలు తెరకెక్కుతున్న ఈ కాలంలో అగ్ర దర్శకులపై ఒత్తిడి ఊహించని స్థాయిలో ఉంటోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, నాగ్ అశ్విన్, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు కేవలం ఒక సినిమాను రూపొందించడం లేదు.. వారు భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మునుపటి రికార్డులను అధిగమించాలనే పట్టుదల వారిని నిరంతరం ఒత్తిడికి గురిచేస్తోంది.
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అత్యంత ఒత్తిడిలో ఉన్న ఫిలిం మేకర్ అని చెప్పవచ్చు. `పుష్ప` ఫ్రాంఛైజీతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన అతడు `పుష్ప 2`తో 1000 కోట్ల క్లబ్ సంచలనంగా మారాడు. అయితే అతడి ముందున్న అసలైన సవాలు రామ్ చరణ్‌తో చేయబోయే RC17. `రంగస్థలం`వంటి క్లాసిక్ తర్వాత వీరిద్దరి కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో తాను సృష్టించిన రికార్డులను చరణ్‌తోనే బ్రేక్ చేయాలనే సానుకూల ఒత్తిడి సుకుమార్‌ను మరింత మెరుగైన అవుట్‌పుట్ ఇచ్చేలా ప్రేరేపిస్తోందని భావిస్తున్నారు. తన శిష్యుడు బుచ్చిబాబు పెద్దితో చాలా రికార్డులను బ్రేక్ చేస్తాడని భావిస్తున్న సుక్కూ.. అంతకుమించి అనే రేంజులో తన ప్రణాళికల్ని విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆయనకు ఆయనే పోటీగా నిలుస్తారు. బాహుబలి, బాహుబలి 2, RRR వంటి అంతర్జాతీయ స్థాయి విజయాల తర్వాత మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ సినిమా `వారణాసి`పై ప్రపంచవ్యాప్తంగా కళ్లు ఉన్నాయి. ప్రతి సినిమాతో ఒక కొత్త రికార్డును నెలకొల్పాలనే తపన ఆయనను పూర్తి పర్ఫెక్షనిస్ట్ గా మార్చింది. ఈ ఒత్తిడి కారణంగానే ఆయన ఒక్కో ప్రాజెక్టుకు మూడు నుండి నాలుగేళ్లు కేటాయిస్తూ.. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. మహేష్ తో వారణాసి చిత్రం భారతీయ సినీపరిశ్రమలో అన్ని రికార్డులను తుడిచేస్తూ సంచలనాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ చాలా భాషలలో విడుదలవుతుండడంతో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలు జక్కన్నపై కచ్ఛితంగా ఒత్తిడిని పెంచుతాయనడంలో సందేహం లేదు.
ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ వంటి యువ దర్శకులకు ఇప్పుడు తమ స్థిరత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. KGFతో ప్రశాంత్ నీల్, కల్కి 2898 ADతో నాగ్ అశ్విన్ సృష్టించిన వండర్స్ బాక్సాఫీస్ వద్ద సునామీని తెచ్చాయి. అయితే ఒక భారీ హిట్ ఇవ్వడం కంటే ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కష్టమనే సత్యాన్ని వీరు గుర్తించారు. అందుకే ప్రశాంత్ నీల్ తన ఎన్టీఆర్ ప్రాజెక్టుతో, నాగ్ అశ్విన్ `కల్కి` సీక్వెల్‌తో హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను మళ్ళీ చూపించాలనే కసితో పని చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలోనే నాగ్ అశ్విన్ చాలా ఎక్కువ సమయం తీసుకోవడమే గాక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. భారీ విజువల్ ఫీస్ట్ అందించాలనే సంకల్పం ఈ దర్శకులపై ఒత్తిడిని పెంచుతోంది.
విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ విజయాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతడి రేంజుకు తగ్గ స్క్రిప్టును అందించడమే గాక పాన్ వరల్డ్ రేంజులో భారీ బ్లాక్ బస్టర్ ని అందించాల్సి ఉంటుంది. దానికోసం అతడు ప్రీప్రొడక్షన్ దశలోనే తీవ్రంగా శ్రమిస్తున్నాడని సమాచారం. హనుమాన్ లాంటి భారీ పాన్ ఇండియా విజయం తర్వాత జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ ఎంతో కసిగా పని చేస్తున్నారు. మల్టీస్టారర్ కోసం అతడు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సమాచారం ఉంది. రాజీ లేకుండా మరో పాన్ ఇండియా విజయం అందించడమే ధ్యేయంగా ప్రశాంత్ వర్మ లాంటి యువ ట్యాలెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ కూడా యూరి, దురంధర్, దురంధర్ 2 వంటి అసాధారణ సక్సెస్ ల తర్వాత తన తదుపరి చిత్రాలతో `అంతకంటే గొప్పగా చేయగలనా?` అనే అంచనాల భారంలో ఉన్నారు.
ఈ భారీ ఒత్తిడి ప్రతికూలతలను మోసుకొస్తున్నా.. మరో కోణంలో సినిమా నాణ్యతను పెంచడానికి ప్రధాన కారణం అవుతోంది. తమ పాత రికార్డులను తామే కొట్టాలనుకున్నప్పుడు దర్శకులు స్క్రిప్ట్, విజువల్స్ అలాగే యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో రాజీ పడకుండా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ ఫార్ములాను ప్రేక్షకులు తిరస్కరిస్తారని తెలిసి... టెక్నాలజీ పరంగా సరికొత్త మార్పులు తెస్తున్నారు. అయితే ఈ అతి జాగ్రత్త వల్ల మేకింగ్ పరంగా బడ్జెట్లు పెరగడం.. షూట్ ఆలస్యం కావడం.. చిన్న పొరపాటు జరిగినా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం కూడా దర్శకులను వెంటాడుతోంది.
