Begin typing your search above and press return to search.

నువ్వేమైనా మహేష్ బాబువా? నందుకి క్లాస్ పీకిన సుకుమార్

తాజాగా నటుడు శ్రీనందు చెప్పిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By:  Sivaji Kontham   |   26 May 2026 11:10 AM IST
నువ్వేమైనా మహేష్ బాబువా? నందుకి క్లాస్ పీకిన సుకుమార్
X

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే చాలదు, త‌ర‌చూ కనిపించడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని చాలా మంది సీనియర్ డైరెక్ట‌ర్లు, యాక్ట‌ర్లు కొత్తవారికి చెబుతుంటారు. కానీ కొంతమందికి మాత్రం అలాంటి సలహాలు జీవితాన్నే మార్చేస్తాయి. తాజాగా నటుడు శ్రీనందు చెప్పిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డైరెక్ట‌ర్ సుకుమార్ తనకు చెప్పిన మాటలే కెరీర్ విషయంలో తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయని నందు వెల్లడించారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు విజిబిలిటీ కూడా అవసర‌మ‌నే విషయాన్ని సుకుమార్ చాలా సూటిగా చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు.

రంగస్థలం సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్స్ లో బిజీగా ఉన్న సమయంలో ఒకసారి సుకుమార్‌ను నందు ప్రెస్ మీట్‌లో కలిసారట. అయితే అక్కడ సుకుమార్ వెంటనే ఏంట్రా అసలు కనిపించడం లేదు, రేపు అర్జెంట్‌గా వచ్చి నన్ను కలువు అని చెప్పారట. మరుసటి రోజు ఆయన చెప్పిన చోటుకు వెళ్లినప్పుడు సుకుమార్ ఏదో రాస్తూ ఉన్నారని, అప్పుడు త‌మ మ‌ధ్య జరిగిన సంభాషణ తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అయ్యిందని నందు చెప్పారు. “నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా? అందరూ నిన్ను గుర్తు పెట్టుకోవడానికి? మాకు లెక్కలేనన్ని పనులుంటాయి. మాకు నువ్వు తెలుసు, నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది. కానీ వెయ్యి పనుల్లో నువ్వు గుర్తొచ్చేలా ఉండాలంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు” అని సుకుమార్ చెప్పారట. అంతేకాదు.. డైరెక్టర్లను కలుస్తూ ఉండు. వాళ్లకి నువ్వు కనిపిస్తే.. అరే మనోడున్నాడు కదా, వాడితో ఏదైనా చేయిస్తే బాగుంటుందేమో అనిపిస్తుందంటూ ఇండస్ట్రీ రియాలిటీని చాలా స్పష్టంగా నందుకి వివరించారట.

సాధారణంగా బయట నుంచి చూస్తే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కేవలం టాలెంట్ ఆధారంగానే వస్తాయని అనిపిస్తుంది. కానీ నందు చెప్పిన ఈ మాటలు మాత్రం సినీ ప్రపంచంలో నెట్‌వర్కింగ్, పర్సనల్ కనెక్షన్స్, కంటిన్యూస్ విజిబిలిటీ ఎంత కీలకమో మరోసారి హైలైట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో యాక్టర్లు తమ పనిని ప్రమోట్ చేసుకోవడం, ఈవెంట్లలో కనిపించడం, డైరెక్ట‌ర్లు-నిర్మాతలతో టచ్‌లో ఉండడం కూడా కెరీర్‌లో భాగమైపోయింది. సుకుమార్ చెప్పిన సలహా తర్వాతే తాను ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనడం మొదలుపెట్టానని, తన పని గురించి ఇతరులకు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదనే అవగాహన వచ్చిందని నందు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి నందు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల అగ్లీ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన, నటుడిగా విభిన్నమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు మాత్రం ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెడుతున్న నటీనటులకు ఒక పెద్ద పాఠంగా మారాయి. కేవలం పని చేస్తే సరిపోదు, మనం ఉన్నామనే విషయం ఇండస్ట్రీకి గుర్తు చేస్తూ ఉండాల‌నే సుకుమార్ ఫిలాసఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కొత్త నటులకు ఇది ఒక రియాలిటీ చెక్ లాంటిదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.