Begin typing your search above and press return to search.

వీరప్పన్ కేసులో సీనియర్ నటి సుకన్యకి భారీ ఊరట .. 30 ఏళ్ల తర్వాత తుది తీర్పు!

కోర్టు మెట్లు ఎక్కిన సుకన్య న్యాయం కోసం గట్టిగానే పోరాడారు. ఈ క్రమంలో 2015లో లోయర్ కోర్టు ఈ కేసును విచారించి సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

By:  Madhu Reddy   |   7 Jun 2026 3:52 PM IST
వీరప్పన్ కేసులో సీనియర్ నటి సుకన్యకి భారీ ఊరట .. 30 ఏళ్ల తర్వాత తుది తీర్పు!
X

ప్రముఖ సీనియర్ నటి సుకన్యకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోర్టులో ఊరట లభించింది. 30 ఏళ్లుగా సాగుతున్న ఒక పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నాటి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరిగిన ఈ వివాదంలో ప్రముఖ ఛానెల్ సన్ టీవీకి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ గతంలో వచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

అసలు ఏం జరిగింది?:

అది 1996వ సంవత్సరం. అప్పట్లో సన్ టీవీలో ‘నెరుక్కు నేర్’ అనే ఒక పాపులర్ ప్రోగ్రామ్ ప్రసారమయ్యేది. అందులో అడవుల స్మగ్లర్ వీరప్పన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేశారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో నటి సుకన్య వ్యక్తిత్వాన్ని, పరువును దెబ్బతీసే విధంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. తనపై లేనిపోని నిందలు వేస్తూ ఆ కంటెంట్‌ను ప్రసారం చేశారంటూ సుకన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె సన్ టీవీపై పరువు నష్టం దావా వేశారు.

2015లోనే మొదటి తీర్పు:

కోర్టు మెట్లు ఎక్కిన సుకన్య న్యాయం కోసం గట్టిగానే పోరాడారు. ఈ క్రమంలో 2015లో లోయర్ కోర్టు ఈ కేసును విచారించి సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక ఆమె పరువుకు భంగం కలిగించినందుకు గానూ రూ. 10.01 లక్షల పరిహారాన్ని చెల్లించాలని సన్ టీవీ నెట్‌వర్క్‌ను ఆదేశించింది. కానీ, ఈ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ యాజమాన్యం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు ఊరట.. ఛానెల్‌కు షాక్:

తాజాగా ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సన్ టీవీ పిటిషన్‌ను పూర్తిగా కొట్టేసింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పే సరైనదని స్పష్టం చేసింది. ఇక ఏదైనా ఒక ఇంటర్వ్యూను టీవీలో ప్రసారం చేసే ముందు, అందులో ఇతరుల పరువుకు నష్టం కలిగించే విషయాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాల్సిన బాధ్యత మీడియా సంస్థలకు ఉంటుందని కోర్టు పునరుద్ఘాటించింది.

మీడియా బాధ్యత ఇదే:

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేసే ముందు ఎడిటింగ్ చేసుకునే పూర్తి నియంత్రణ సన్ టీవీకి ఉందని కోర్టు గుర్తు చేసింది. నటి సుకన్యపై ఉన్న వివాదాస్పద భాగాలను ఎడిటింగ్‌లో తొలగించే అవకాశం ఉన్నా ఛానెల్ అలా చేయలేదని తప్పుబట్టింది. ఇక అందుకే సుకన్యకు ఖచ్చితంగా ఆ పరిహార సొమ్మును చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఎట్టకేలకు 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నటి సుకన్యకు న్యాయం జరగడం పట్ల సినిమా ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఆలస్యమైనా సరే నిజాయితీ గెలిచిందని అభిమానులు అంటున్నారు. అలాగే, రేటింగ్స్ కోసం ఎవరి పరువు పడితే వారి పరువు తీసేలా ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తే కోర్టులు ఊరుకోవు అని చెప్పడానికి ఈ తీర్పు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.