Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ విల‌న్‌గా మారుతున్న యంగ్‌ హీరో!

అభిమానుల స‌పోర్ట్‌తో త‌మిళ సినిమా `మందాడి`లో విల‌న్‌గా ప‌రిచ‌యం అవుతున్నాన‌ని, ఇదే త‌న తొలి త‌మిళ సినిమా అని వెల్ల‌డించాడు.

By:  Tupaki Desk   |   9 July 2025 4:03 PM IST
మ‌ళ్లీ విల‌న్‌గా మారుతున్న యంగ్‌ హీరో!
X

విభిన్న‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు యంగ్ హీరో సుహాస్‌. క‌థాబ‌ల‌మున్న సినిమాల‌తో న‌టుడిగా ప్ర‌శంస‌ల‌తో పాటు వ‌రుస స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటూ యంగ్ హీరోల రేసులో త‌న‌దైన పంథాలో దూసుకుపోతున్నాడు. షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, హీరో ఫ్రెండ్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన సుహాస్ `క‌ల‌ర్ ఫోటో`తో హీరోగా అరంగేట్రం చేయ‌డం తెలిసిందే.

కెరీర్ ప్రారంభం నుంచి క‌థాబ‌ల‌మున్న సినిమాల‌ని ఎంచుకుంటూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నాడు. రీసెంట్‌గా కీర్తిసురేష్‌తో క‌లిసి `ఉప్పుక‌ప్పురంబు` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సుహాస్ త్వ‌ర‌లో 'ఓ భామ అయ్యో రామ‌' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రాము గోదాల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా జూలై 11న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. దీనితో పాటు మ‌రో రెండు సినిమాలు `కేబుల్ రెడ్డి`, ఆనంద‌రావు అడ్వెంచ‌ర్స్‌`ల‌లో న‌టిస్తున్నాడు.

ఇదిలా ఉంటే సుహాస్ మ‌రో సారి విలన్‌గా క‌నిపించ‌డానికి రెడీ అయిపోయాడు. గ‌తంలో `హిట్‌2`లో సైకో విల‌న్‌గా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సుహాస్ మ‌రోసారి విల‌న్ అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. అది కూడా ఓ క‌మెడియ‌న్ మూవీ కోసం. వివ‌రాల్లోకి వెళితే.. `విడుద‌లై` సినిమాతో హీరోగా మారిన త‌మిళ క‌మెడియ‌న్ సూరి హీరోగా `మందాడి` పేరుతో ఓ త‌మిళ మూవీ రూపొందుతోంది. ఇందులో సుహాస్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన 'ఓ భామ అయ్యో రామ 'ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుహాస్ వెల్ల‌డించాడు.

అభిమానుల స‌పోర్ట్‌తో త‌మిళ సినిమా 'మందాడి'లో విల‌న్‌గా ప‌రిచ‌యం అవుతున్నాన‌ని, ఇదే త‌న తొలి త‌మిళ సినిమా అని వెల్ల‌డించాడు. అంతే కాకుండా ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్న హీరోయిన్ మాళవిక త‌న స్నేహితుల క్ర‌ష్ అని తెలప‌డం విశేషం. ఇటీవ‌ల `మందాడి` ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేయ‌డం దానికి ప్రేక్ష‌కుల నుంచి భారీ స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భించ‌డం తెలిసిందే. `హిట్ 2`లో సైకో విల‌న్‌గా షాకింగ్ పెర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టిన సుహాస్ త‌మిళ మూవీ `మందాడి`లోనూ అదే త‌ర‌హాలో ఆక‌ట్టుకుని శ‌భాష్ అనిపించుకుంటాడేమో వేచి చూడాల్సిందే.