చిరంజీవి చేస్తే పర్వాలేదు.. సుధీర్ చేస్తే గొడవ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'బావగారు బాగున్నారా' సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌ను బుల్లి తెర స్టార్ యాంకర్ కమ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ రీ క్రియేట్ చేశాడు.
By: Tupaki Desk | 10 April 2025 5:23 AMమెగాస్టార్ చిరంజీవి నటించిన 'బావగారు బాగున్నారా' సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌ను బుల్లి తెర స్టార్ యాంకర్ కమ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ రీ క్రియేట్ చేశాడు. కామెడీ షో అన్నప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల సీన్స్‌ను రీ క్రియేట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. చాలా వరకు నవ్వు తెప్పిస్తే, కొన్ని రీ క్రియేషన్స్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ రీ క్రియేట్ చేసిన సమయంలో తమ హీరో ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా చేశారంటూ ఆయా హీరోల అభిమానులు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. తాజాగా సుడిగాలి సుధీర్ అలాంటి ఒక వివాదంలో చిక్కుకుని పెద్ద తలనొప్పిని ఎదుర్కొంటున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తూ వచ్చాడు. హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఒక రియాల్టీ షో కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో సూపర్ హిట్ టాక్‌తో దూసుకు పోతుంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది. ఎప్పటి లాగే సుధీర్‌ను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా సీనియర్ హీరోయిన్ రంభ హాజరు అయ్యారు. ఆమెతో సుదీర్ సరదాగా కామెడీ స్కిట్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆమె నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఐకానిక్ టెంపుల్ సీన్ను రీ క్రియేట్ చేశారు.
సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ ఉంటే రంభ కనిపిస్తుంది. అదే ఇక్కడ రీ క్రియేట్ చేశారు. సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తూ ఉన్న సమయంలో రంభ కనిపిస్తుంది. నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించడం ఏంటి అంటూ నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. ఇలాంటివి హిందువుల మనోభావాలను దెబ్బ తీయడం అవుతుందని, కామెడీ కోసం ఇలా చేయడం అనేది కచ్చితంగా మంచి పద్దతి కాదు అంటూ చాలా మంది సుధీర్ కామెడీ స్కిట్ ను విమర్శిస్తూ వచ్చారు. వెంటనే సుధీర్‌తో పాటు సదరు షో నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.
1998లో వచ్చిన బావగారు బాగున్నార సినిమాలోని సీన్‌ను రీ క్రియేట్ చేశారు. కొత్తగా ఏం చేయలేదు, కానీ అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఏంటి అంటూ కొందరు సుధీర్‌ను అభిమానించే వారు అంటున్నారు. మెగాస్టార్ చేస్తే పర్వాలేదు కానీ కామెడీ కోసం సుధీర్ అలాంటివి చేయవద్దు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. అభిమానుల వార్ పక్కన పెడితే గతంలో సోషల్ మీడియా పరిధి అంతగా లేదు. గతంతో పోల్చితే ఈమధ్య కాలంలో అన్ని విషయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కనుక ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సినిమాల్లోనే కాకుండా, బుల్లి తెరపై కూడా మనోభావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.