1960 టైమ్‌ని రీక్రియేట్ చేశారండోయ్!
ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన `ఆకాశమే నీ హద్దురా` మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏ స్థాయి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
By: Tupaki Desk | 25 Dec 2025 3:00 PM ISTఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన `ఆకాశమే నీ హద్దురా` మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏ స్థాయి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో సూర్య కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టిందీ చిత్రం. దీనికి సుధా కొంగర దర్శకత్వం వహించింది. కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేసి సుధా కొంగర ఈ కథని సిద్ధం చేసి ఎక్కడా తడబాటు లేకుండా తెరకెక్కించి తమిళ, తెలుగు ప్రేక్షకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు.
ఈ ఊవీ అందించిన సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని సుధాకొంగర మరో సమస్యాత్మకమైన కథని ఎంచుకున్నారు. అదే `పరాశక్తి`. ఆమె తాజగా తెరకెక్కిస్తున్న మూవీ `పరాశక్తి`. శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి, మలయాళ దర్శకుడు, హీరో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1960వ దశకం నేపథ్యంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
హిందీ వ్యతిరేకోద్యమం ప్రధానంగా ఈ మూవీని పొలిటికల్ హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. స్టూడెంట్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రదాన భూమిక పోషించే యువ లీడర్ క్యారెక్టర్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. తనకు సపోర్ట్‌గా నిలిచే పాత్రల్లో శ్రీలీల, అధర్వ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. జనవరి 10న భారీ స్థాయిలో ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 1960 వ దశకం నేపథ్యంలో కథ సాగుతుండటంతో ఆ కాలాన్ని రీక్రియేట్ చేశారు. కాలేజ్, రైల్వే స్టేషన్, రైలు... ఇలా కథకు కీలకంగా నిలిచిన ప్రతీ దాన్ని రీక్రియేట్ చేసి ఆశ్చర్యపరుస్తన్నారు. ఈ సెట్‌లలో హీరో శివకార్తికేయన్, అధర్వ, శ్రీలీల, డైరెక్టర్ సుధా కొంగర సందడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేస్తోంది. ఆ నాటి కాలాన్ని రీ క్రియేట్ చేస్తూ పలు ఆసక్తికరమైన వాటిని రూపొందించారు. అలనాటి గోలీ సోడాలు, షెవర్లే కార్లు, లాగే రిక్షాలు, తాటాకుల థియేటర్లు, రైల్వే, రేడియో స్టేషన్‌లు ఒక నాటి తమిళనాడు వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి.
1960లో హిందీ వ్యతిరేక ఉద్యమం ఏంటీ?
1960లో తమిళనాడు స్టేట్‌లో ఒక్కసారిగా హిందీ వ్యతిరేక ఉద్యమం కట్టులు తెంచుకుంది. దీనికి కాలేజ్ స్టూడెంట్స్ కూడా తోడవ్వడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఓ రాజకీయ పార్టీకి, స్టూడెంట్స్‌కు మధ్య చలరేగిన గొడవ మధురైలో అల్లర్లకు దారితీసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలతో తమిళనాట ద్రవిడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటనలని ప్రస్తుతం హిందీకి వ్యతిరేకంగా అడుగులు పడుతున్న వేళ సుధా కొంగర `పరాశక్తి`ని తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
