Begin typing your search above and press return to search.

తేనెతుట్టెను క‌దుపుతున్న లేడీ డైరెక్ట‌ర్‌!

సూర్య హీరోగా లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన మూవీ `ఆకాశ‌మే హ‌ద్దురా`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం వ‌ద్ద ఏడేళ్ల పాటు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన సుధా కొంగ‌ర ద‌ర్శ‌కురాలిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2025 9:26 AM IST
తేనెతుట్టెను క‌దుపుతున్న లేడీ డైరెక్ట‌ర్‌!
X

సూర్య హీరోగా లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన మూవీ `ఆకాశ‌మే హ‌ద్దురా`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం వ‌ద్ద ఏడేళ్ల పాటు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన సుధా కొంగ‌ర ద‌ర్శ‌కురాలిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌లు, య‌ధార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. `సింప్లీ ఫ్లై డెక్క‌న్` ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఆథారంగా `ఆకాశ‌మే హ‌ద్దురా` చిత్రాన్ని రూపొందించి ప్ర‌శ్నంస‌ల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ సారి మ‌రో స‌మ‌స్యాత్మ‌క‌మైన క‌థ‌ని ఎంచుకుని స‌రికొత్త సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. సుధా కొంగర తాజా సినిమాతో తేనెతుట్టెను క‌ద‌ప‌బోతోంది. ఆమె రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ `ప‌రాశ‌క్తి`. శివ‌కార్తికేయ‌న్, శ్రీ‌లీల జంట‌గా న‌టిస్తున్న ఈ మూవీని 1965 నేప‌థ్యంలో పీరియాడిక్ పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. 1965లో త‌మిళ‌నాట జ‌రిగిన హిందీ వ్య‌తిరేకోద్య‌మం నేప‌థ్యంలో ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో జ‌యం ర‌వి, అధ‌ర్వ, మ‌ల‌యాళ క్రేజీ హీరో బాసిల్ జోసెఫ్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. వ‌చ్చే ఏడాది పొంగ‌ల్‌కు రిలీజ్ చేయాల‌ని డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ప్లాన్ చేస్తున్నారు. ద‌క్షిణాదిపై కేంద్రం బ‌ల‌వంతంగా హిందీ భాష‌ని రుద్దుతోంద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై త‌మిళ‌నాట పెద్ద దుమార‌మే న‌డుస్తోంది.

ప్ర‌స్తుతం బ‌ర్నింగ్ ఇష్యూగా ఉన్న ఇదే అంశాన్ని తీసుకుని 1965 నేప‌థ్యంలో సుధా కొంగ‌ర ఈ మూవీని తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమా చుట్టూ ఎలాంటి వివాదాలు చుట్టుముడ‌తాయోన‌ని త‌మిళ‌నాట పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. 1965 నుంచి త‌మిళ‌నాట హిందీ వ్య‌తిరేకోద్య‌మం న‌డుస్తోంది. ప్ర‌స్తుతం అదే వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో `ప‌రాశ‌క్తి`తో హీరో శివ‌కార్తికేయ‌న్‌, డైరెక్ట‌ర్ సుధాకొంగ‌ర టాక్ ఆఫ్ ది ఇండియా కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.