Begin typing your search above and press return to search.

రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన న‌టుడు!

రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణం, కష్టం దాగి ఉంటాయనే నిజాన్ని మలయాళ నటుడు సుబీష్ సుధి స్వీయా అనుభ‌వంతో మరోసారి గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   4 May 2026 9:00 PM IST
రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన న‌టుడు!
X

రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణం, కష్టం దాగి ఉంటాయనే నిజాన్ని మలయాళ నటుడు సుబీష్ సుధి స్వీయా అనుభ‌వంతో మరోసారి గుర్తు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన `ఓరు సర్కార్ ఉత్పన్నమ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా పరాజయం తన జీవితాన్ని ఎంతటి అగాధంలోకి నెట్టిందో వివరిస్తూ సోషల్ మీడియాలో రాసిన లేఖ అందరినీ కలిచివేస్తోంది. సినిమా ఫెయిల్ అవ్వడమే కాకుండా దానివల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తనను చావు అంచుల వరకు తీసుకెళ్లాయని వెల్లడించారు.

ఒక నటుడు సర్వస్వాన్ని ధారపోసి చేసిన సినిమా విఫలమైనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. సుబీష్ సుధి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం ప్రతికూలంగా రావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో తాను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని ధైర్యంగా బయటపెట్టారు. మనిషి ప్రాణం కంటే సినిమా విజయం పెద్దది కాదని తెలిసినా? ఆ క్షణంలో కలిగిన నిరాశ తనను అనాలోచిత నిర్ణయాల వైపు నడిపించిందని ఆవేదన చెందారు. సినిమా పరాజయం కేవలం మానసిక వేదననే కాకుండా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకొచ్చింది.

సినిమా కోసం చేసిన అప్పులు తీర్చలేక తన ఇల్లు జప్తు అయ్యే పరిస్థితికి వ‌చ్చేసింద‌ని సుబీష్ సుధి తెలిపారు. తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోతుందనే భయం తనను ప్రతి నిమిషం వెంటాడుతోందని పేర్కొన్నారు. ఒక మధ్యతరగతి నటుడు సినిమా కలల కోసం పడే కష్టాలు, ఆ తర్వాత ఎదురయ్యే ఆర్థిక పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. సినిమా రంగంలో ఉన్న గ్లామర్‌ను చూసి మోసపోవద్దని ఇక్కడ విజయాల వెనుక ఎంతటి రిస్క్ ఉంటుందో గమనించాలని లేఖలో పేర్కొన్నారు.

`నా ఇల్లు ఇప్పుడు బ్యాంకు అధికారుల ఆధీనంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. నాకు దిక్కుతోచడం లేదు` అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలోని అస్థిరతను ఎండ గడుతున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్ల మద్దతు లేకపోవడం, సరైన ప్రచారం దక్కకపోవడం వంటి కారణాలు తనలాంటి ఎంతోమందిని రోడ్డున పడేస్తున్నాయని వాపోయారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా తనకు మద్దతుగా నిలిచిన కొందరు స్నేహితులు , సహచరుల వల్ల తాను మళ్ళీ బతకాలనే ఆశను పెంచుకున్నట్లు సుబీష్ తెలిపారు. ఆత్మహత్య అనేది దేనికీ పరిష్కారం కాదని ఎదురు దెబ్బల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని తానిప్పుడు గ్రహించినట్లు పేర్కొన్నారు. తన పరిస్థితిని వివరిస్తూ ఆయన రాసిన లేఖ ద్వారా అప్పుల ఊబిలో ఉన్న మరికొందరికి ధైర్యం చెప్పాలని ఆశిస్తున్నారు.

వెండితెరపై మెరుపులు ఎంత అందంగా ఉన్నా? తెర వెనుక జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పుడు నటీనటులు ఒంటరివారు కాకుండా చిత్ర పరిశ్రమలోని పెద్దలు , సంఘాలు వారికి తోడుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుబీష్ సుధి గండం నుండి గట్టెక్కి మళ్ళీ నటుడిగా నిలదొక్కుకోవాలని నెటి జ‌నులు కోరుతున్నారు.