డైరెక్టర్ పా. రంజిత్ పై కేసు.. కొరియోగ్రాఫర్ వద్దన్నా ఆ స్టంట్ చేశాడట..
కోలీవుడ్ లో స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ షూటింగ్ లో చనిపోవడం యావత్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది.
By: Tupaki Desk | 15 July 2025 10:58 AM ISTకోలీవుడ్ లో స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ షూటింగ్ లో చనిపోవడం యావత్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఆర్య హీరోగా, ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టువం షూటింగ్ లో కారు బోల్తా కొట్టే స్టంట్ లో పాల్గొంటూ మోహన్ రాజ్ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు పా. రంజిత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయ్యాక కూడా స్టంట్ మాస్టర్లను పెట్టుకుని ఇలాంటి రిస్కీ షాట్స్ ఎందుకు చేయిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కాగా డైరెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పా. రంజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ కమల్, వెహికల్ ఓనర్ ప్రకాష్, షూట్ మేనేజర్ వినోద్‌పై కేసు నమోదు చేశారు కీజాయిర్ పోలీసులు.
మోహన్ రాజ్ చాలా ఏళ్లుగా స్టంట్ ట్రైనర్ గా పని చేస్తున్నారు. తాజాగా నాగ పట్నం జిల్లా కీజాయుర్ దగ్గర వేదమావడి గ్రామంలో జరుగుతున్న వెట్టువం షూటింగ్ లో కారు బోల్తా కొట్టే సీన్ చేస్తుండగా అందులో మోహన్ రాజ్ పాల్గొన్నారు. కారు రెండు పల్టీలు కొట్టి ఆగిపోగా అందులో ఉన్న మోహన్ రాజ్ ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉండటాన్ని గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
మోహన్ రాజ్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోయినా ఆయనెలా చనిపోయారనేది ముందు ఎవరికీ అర్థం కాలేదు. కానీ అంతర్గత గాయం, తలలో రక్తస్రావం జరిగిందని అందుకే మోహన్ రాజ్ చనిపోయారని పోస్ట్‌మార్టంలో తేలిందని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయంపై విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రాజు తనకు గత 20 ఏళ్లుగా తెలుసని, ఆయన మరణం తననెంతగానో కలచివేసిందని, అతని ఇద్దరు పిల్లలున్నారని, అతని కుటుంబానికి అండగా నిలుస్తామని మాటిచ్చారు.
దీంతో పాటూ ఈ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలను కూడా విశాల్ తెలిపారు. ఈ స్టంట్ చాలా రిస్క్ తో కూడుకున్నది కావడంతో దీన్ని చేయొద్దని మోహన్ రాజ్ కు స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ చెప్పినప్పటికీ రాజ్ మాత్రం తానే స్వయంగా చేస్తానని పట్టుబట్టి మరీ చేసి ప్రాణాలు కోల్పోయారని విశాల్ తెలిపారు. ఇది స్టంట్ ఆర్టిస్టుల డెడికేషన్ కు నిదర్శనమని, స్టంట్ ఆర్టిస్టులు ఎప్పుడూ తమ గాయాలను బయటపెట్టరని, అలా చేస్తే తర్వాతి రోజు తిరిగి తమను పనికి పిలవరేమోనని వారు భయపడతారని విశాల్ అన్నారు.
