సినిమా మేకింగ్‌లో AI ప్రభావంపై స్పీల్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమా మేకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు లేదా ఏఐ) వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
By: Sivaji Kontham | 30 May 2026 3:08 PM ISTహాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమా మేకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు లేదా ఏఐ) వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్పీల్‌బర్గ్ మాట్లాడుతూ... సినిమా రంగంలో సృజనాత్మక ప్రక్రియకు సంబంధించిన ఏ విషయానికైనా హాలీవుడ్ ఎప్పటికీ ఏఐని తుది నిర్ణయంగా తీసుకోకూడదని గట్టిగా హెచ్చరించారు. సాంకేతికత ఎంత పెరిగినా మనుషుల భావోద్వేగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం 79 ఏళ్ల లెజెండరీ దర్శకుడు స్పీల్ బర్గ్ మాట్లాడుతూ.. రచయితల టేబుల్ వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉండి ఆ స్థానాన్ని ఏఐ భర్తీ చేయడాన్ని తాను అస్సలు ఇష్టపడనని చెప్పారు. కంప్యూటర్లకు సొంతంగా ఆలోచించే లేదా అనుభవించే స్పృహ ఉంటుందనే విషయాన్ని తాను నమ్మనని స్పీల్‌బర్గ్ ఓపెన్ అయ్యారు. మానవ ఆత్మకు..+ వారి అంతర్గత సృజనాత్మకతకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని అన్నారు. మనుషుల కంటే ఒక కంప్యూటర్ ఎక్కువగా అనుభూతి చెందుతుందని భావించడం అనేది తాను పెరిగిన వాతావరణానికి.. భవిష్యత్తులో తాను చేయబోయే ఫిలింమేకింగ్ కి, దర్శకత్వ వృత్తికి పూర్తిగా విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
సినిమా నిర్మాణంలో ఏఐ పాత్ర ఏ మేరకు ఉండాలనే దానిపై స్పీల్‌బర్గ్ ఒక స్పష్టమైన గీతను గీశారు. కేవలం ఒక సహాయక సాధనం(టూల్)గా ఏఐని ఉపయోగించుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు సినిమా షూటింగ్ కోసం సరికొత్త - అనువైన లొకేషన్లను వెతకడంలో ఏఐ సహాయం తీసుకుంటే అది దర్శకులకు ఎంతో మేలు చేస్తుందని అంగీకరించారు. అయితే కేవలం సమాచార సేకరణ -సాంకేతిక సహాయం వరకే ఏఐ పరిమితం కావాలని.. అంతకుమించి అది సినిమా కథనంలో జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నానని అన్నారు.
కానీ ఒక దర్శకుడిగా తన సినిమా కోసం ఏ నటీనటులను ఎంపిక చేయాలి? పాత్రల మధ్య డైలాగులు ఎలా రాయాలి? కెమెరాను ఏ కోణంలో పెట్టాలి? లేదా సినిమా సెట్ ఏ విధంగా కనిపించాలి? అనే సృజనాత్మక విషయాలను ఒక ఏఐ టూల్ తనకు సూచించడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సృజనాత్మక రంగాన్ని శాసించే అల్గారిథమ్స్ ఇంకా కనుగొనలేదని... కళలో మానవీయ కోణమే ప్రధానమని నమ్ముతున్నట్టు తెలిపారు. సినిమా అనేది కేవలం కొన్ని ఆర్డర్ల (కమాండ్స్) సమాహారం కాదు... అది మానవ మేధస్సు - హృదయం నుండి వచ్చే ఒక అద్భుత సృష్టి! అని స్పీల్‌బర్గ్ వివరించారు.
అయితే చిత్ర పరిశ్రమలో ఏఐ వాడకాన్ని వ్యతిరేకించిన స్పీల్‌బర్గ్... ఇతర రంగాలలో దాని ఉపయోగాలను మాత్రం ప్రశంసించారు. వైద్య రంగంలో ఎదురవుతున్న క్లిష్టమైన సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొనడంలో .. విద్యా రంగంలో విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించడంలో ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా మారుతుందని స్పీల్ బర్గ్ అభిప్రాయపడ్డారు. సాంకేతికతను మానవ కళాత్మకతను దెబ్బతీయడానికి కాకుండా... సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినప్పుడే దానికి నిజమైన సార్థకత చేకూరుతుందని ఈ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడి మాటలను బట్టి స్పష్టమవుతోంది.
