Begin typing your search above and press return to search.

ప‌రిశ్ర‌మ కుట్ర‌ల‌తో డిప్రెషన్‌లోకి స్టార్ హీరో

ఇటీవలి ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంలో తనకు సహాయం చేసిన బాలీవుడ్ స్టార్ పేరును ఇప్ప‌టికి వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:15 AM GMT
ప‌రిశ్ర‌మ కుట్ర‌ల‌తో డిప్రెషన్‌లోకి స్టార్ హీరో
X

ఇత‌ర రంగాల్లానే సినీఇండ‌స్ట్రీలో కుట్ర‌లు కుతంత్రాలు చాలా రొటీన్. ఎదిగేవారిని తొక్కేవాళ్లు ఇక్క‌డ‌ ఉంటారు. ప‌రిశ్ర‌మ‌లో బంధుప్రీతి, లాబీయింగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. అయితే ఎంద‌రు గొప్ప హీరోలు ఉన్నా కానీ, త‌న‌కంటూ ఒక గుర్తింపు ఉంద‌ని నిరూపించిన స్టార్ హీరో అనంత‌ర కాలంలో కెరీర్ ప‌రంగా క్లిష్ఠ ద‌శ‌ను ఎదుర్కొన్నాడు. ప‌రిశ్ర‌మ‌లోని ఒక నిర్దిష్ట వర్గం తనను బహిష్కరించ‌డంతో అత‌డికి కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌లేదు. తాను గొప్ప ప్ర‌తిభ‌ను చూపించినా.. చెప్పుకోద‌గ్గ‌ అవార్డులు సాధించినా.. అస్స‌లు మంచి అవ‌కాశాలు పొందలేకపోయాన‌ని, ఇది తనను తీవ్ర‌ నిరాశకు గురిచేసిందని స‌ద‌రు స్టార్ హీరో పేర్కొన్నాడు. ఆ సమయంలో ఇండ‌స్ట్రీ స్నేహితుడు, స‌హ‌నటుడు త‌న‌కు ఫోన్ చేసి సమస్యలను వినడమే కాకుండా, త‌న ఇంటికి చేరుకుని గొప్ప‌ సహాయం అందించాడని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

ప‌రిశ్ర‌మ‌ బహిష్కరించిన తర్వాత తీవ్ర డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్న క్ర‌మంలో స‌హ‌న‌టుడు ఇచ్చిన ఆ ఆలోచ‌న త‌న జీవితాన్ని మార్చేసింది. నెమ్మ‌దిగా కోలుకుని తిరిగి స్టార్ గా నిల‌దొక్కుకునేందుకు ఉప‌క‌రించింది. ఈ ఎపిసోడ్ లో నిషేధాన్ని ఎదుర్కొన్న హీరో- వివేక్ ఒబెరాయ్. అత‌డికి స‌హాయం చేసిన న‌టుడు అక్ష‌య్ కుమార్.

ఇటీవలి ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంలో తనకు సహాయం చేసిన బాలీవుడ్ స్టార్ పేరును ఇప్ప‌టికి వెల్లడించాడు. ఒబెరాయ్ తాజా ఇంట‌ర్వ్యూలో చాలా బ‌య‌టికి తెలియ‌ని విష‌యాలు తెలిపాడు. వివేక్ న‌టించిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' ప్ర‌చార ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌ను వెల్ల‌డించాడు. ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ తనకు అవ‌కాశాలు రాకుండా చేసిన కుట్ర‌లు, క్లిష్ఠ‌ సమయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను మంచి సినిమాలు చేస్తున్నానని, తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయని, అవార్డులు కూడా అందుకున్నానని, అయితే దానికి త‌గ్గ‌ట్టు మంచి పనిని రాబట్టలేకపోయానని చెప్పాడు. త‌న‌ను బాలీవుడ్‌లోని ఒక వర్గం క‌చ్చితంగా బహిష్కరించింద‌ని, అది తన జీవితంలో అత్యంత కష్టతరమైన దశ అని అన్నాడు.

ఆ స‌మ‌యంలో తాను డిప్రెష‌న్ లోకి వెళ్లాడు. కానీ తనకు అక్షయ్ కుమార్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ చేసి బాగున్నావా? అని అడిగాడు. దానికి స‌మాధాన‌మిస్తూ.. వివేక్ తన నిరుత్సాహాన్ని బయటపెట్టాడు. ప్రస్తుత పరిస్థితులను భరించలేకపోతున్నానని చెప్పాడు. అరగంటలో అక్షయ్ తన ఇంటికి చేరుకుని తనకు మ‌ర్చిపోలేని గొప్ప‌ సహాయం అందించాడని వివేక్ గుర్తు చేసుకున్నాడు. లాబీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతానని అక్షయ్ చెప్పలేదని, అయితే అతడు క‌చ్చితంగా చాలా ఆచరణాత్మకమైన చాలా అవసరమైన పరిష్కారాన్ని సూచించాడని వివేక్ చెప్పాడు. సానుకూల ఆలోచనతో వివేక్‌కు సహాయం చేయగలనని అక్షయ్ చెప్పాడు. వివేక్ తన విష‌యంలో అక్షయ్ ఆలోచనాత్మక విధానం గురించి వెల్లడించాడు. స్టేజ్ షోల కోసం తనకు చాలా ఆఫర్లు వచ్చాయని, అయితే తాను పెద్ద తెర‌పై బిజీగా ఉన్నందున, చాలా షోలను వదులుకోవాల్సి వచ్చిందని అక్షయ్ అప్ప‌ట్లోనే వివేక్‌తో చెప్పాడు. ఏ షో ఆఫర్స్ వచ్చినా తాను చేయలేని వాటిని తనకు అందజేస్తానని ఒబేరాయ్ కు ప్రామిస్ చేసాడు.

అదే క్ర‌మంలో వివేక్ ఒబేరాయ్ స్టేజ్ షోలకు హోస్టింగ్ చేసాడు. ఆ తర్వాత నెమ్మ‌దిగా అభిమానులు అతడిని ఆదరించడం ప్రారంభ‌మైంది. స్టేజ్ షోలు తనకు సహాయపడ్డాయని, చాలా సానుకూలంగా క్లిష్ట దశను అధిగమించడంలో సహాయపడ్డాయ‌ని వివేక్ చెప్పారు. ఎప్ప‌టికీ అక్షయ్‌కి వివేక్ కృతజ్ఞతతో ఉన్నాన‌ని కూడా తెలిపాడు.