2024లోనే మన స్టార్ హీరోల మెరుపులు
ఇలాంటి తరుణంలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించకుండా, బొత్తిగా నల్లపూసలైపోయిన హీరోలు ఎవరెవరు? అన్నది ఆరా తీస్తే టాలీవుడ్ నుంచి పలువురు కనిపించారు.
By: Tupaki Desk | 10 Dec 2023 12:30 PM2023 ముగుస్తోంది.. తదుపరి 2024లో అడుగుపెడుతున్నాం. డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించకుండా, బొత్తిగా నల్లపూసలైపోయిన హీరోలు ఎవరెవరు? అన్నది ఆరా తీస్తే టాలీవుడ్ నుంచి పలువురు కనిపించారు. విక్టరీ వెంకటేష్ , నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్లు నటించిన సినిమాలేవీ రాలేదు.
అయితే వెంకీ ఇప్పుడు కెరీర్ 75వ సినిమా సైంధవ్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ల్యాండ్ మార్క్ మూవీతో ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలని కసిగా పని చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలవుతుంది. మరోవైపు నాగార్జున నా సామిరంగా చిత్రంతో బిజీగా ఉన్నారు. అటు రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తూ బిజీగా అయ్యారు. గేమ్ చేంజర్ వచ్చే ఏడాది చివరిలో విడుదలవుతుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగం వచ్చే ఏడాది విడుదలవుతుంది. అల్లు అర్జున్ పుష్ప బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పుష్ప 2పైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. పుష్ప 2తో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో వెంకీ, మహేష్ నటించిన సినిమాలు రానున్నాయి. ఆ తర్వాత ద్వితీయార్థం లేదా ఏడాది చివరిలో చరణ్, ఎన్టీఆర్, బన్ని నటించే సినిమాలు విడుదలవుతాయి. ప్రస్తుతం మన హీరోలంతా పాన్ ఇండియా రేస్ లోకి దూసుకొచ్చారు. దీంతో ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా విడుదలవ్వడం కష్టం. పాన్ ఇండియా చిత్రాల కోసం ఏళ్ల తరబడి పని చేయాల్సి ఉంటుంది. కారణం ఏదైనా అభిమానులు అంతే ఓపిగ్గా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందిప్పుడు.