Begin typing your search above and press return to search.

నెగిటివ్ టాక్ ను డామినేట్ చేస్తున్న స్టార్ పవర్

ఒకప్పుడు సినిమా హిట్ అయిందా కాదా అన్నది టాక్ చూసి తేలేదేమో కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

By:  Tupaki Desk   |   12 April 2025 5:00 PM IST
Star Power Drives Box Office Success
X

ఒకప్పుడు సినిమా హిట్ అయిందా కాదా అన్నది టాక్ చూసి తేలేదేమో కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టాక్‌తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు వసూళ్లను కొల్లగొడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రివ్యూస్, రేటింగ్స్‌ వేరే కోణంలో ఉండగా, థియేటర్ల వద్ద కలెక్షన్లు వేరే రేంజ్‌లో కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రేక్షకుడి మానసిక స్థితిలో వచ్చిన మార్పును సూచిస్తుంది. కొన్నిసార్లు ప్రేక్షకుడు కథల కోసం రాడు, హీరోల కోసం వస్తున్నాడు అనే అభిప్రాయం హైలెట్ అవుతోంది.

మాస్ ఎలిమెంట్లు, థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్, సెల్ఫీ మూమెంట్.. ఇవే ఇప్పుడు ఓ వర్గం అంచనాలు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఈ తరహా మాస్ కంటెంట్ కు ఒక ఉదాహరణ. కథలొ లోపాలున్నాయని విమర్శలు వస్తున్నా, థియేటర్లలో హడావుడి మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే అజిత్ ఫ్యాన్స్ కోసం థియేటర్ ఒక పండుగ ప్రదేశంలా మారిపోతోంది.

మరోవైపు వైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన L2: ఎంపురాన్ తీసుకుంటే, అసలు సినిమా ఫస్ట్ పార్ట్ లూసిఫర్ రేంజ్‌లోనే లేదు అన్న టాక్ వచ్చినా, కేరళలో మాత్రం రికార్డ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడి ప్రేక్షకుడికి అది కథ కాదు, ఒక బ్రాండ్ మీద ఉన్న నమ్మకం. మోహన్‌లాల్ పైన ఉన్న సెంటిమెంట్, సినిమా ఎంత నెగటివ్ టాక్ ఉన్నా అందులోని ఎలివేషన్స్ కు కనెక్ట్ అవుతున్నారు.

ఇదే విషయాన్ని మన తెలుగులో కొన్ని సినిమాలు కూడా ఉదాహరణగా నిలిచాయి. గుంటూరు కారం, దేవర మొదటి పార్ట్ టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు మాత్రం స్ట్రాంగ్. ఇదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. మొదటి రోజు ప్రదర్శన తర్వాత కథ గురించి ఎవరు మాట్లాడకపోయినా, థియేటర్ వద్ద టికెట్ల అమ్మకాలు మాత్రం సూపర్ ఫాస్ట్ గా ఉంటాయి.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటే.. స్టార్ సినిమా ఇప్పుడు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. ప్రేక్షకుడు ఒక హీరోని అభిమానించడమే కాదు, ఆ హీరో విజయాన్ని తనదిగా భావిస్తున్నాడు. అందుకే స్క్రీన్ మీద ఏం చూపించినా, మొదటిసారి మాత్రం చూస్తాడు. ఆ తర్వాత మౌత్ టాక్ ప్రాభావం వస్తుందేమో కానీ, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో వైబ్ మాత్రం అసలైన మంత్రం.

ఇక ఫైనల్‌గా చెప్పాలంటే.. టాక్‌పై ఆధారపడే రోజులు కాస్త తగ్గుతున్నాయి. ఇప్పుడు స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, థియేట్రికల్ ఎమోషన్ కలిపితే ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. సినిమా బ్రతకాలంటే మాత్రం కంటెంట్ తప్పనిసరి. కానీ మొదటి రోజే వసూళ్లను కొల్లగొట్టాలంటే, స్టార్స్ చుట్టూ ఉండే పాజిటివ్ వైబ్ కూడా ఒక ముఖ్య కారణంగా నిలుస్తోంది.