'క్షేమంగా వెళ్లండి' అంటూ స్టార్లు ఫ్యాన్స్‌ని వేడుకోవాలా?
అభిమాన హీరో ఎక్కడైనా కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయం సందర్భంతో ఫ్యాన్స్ కు పనే లేదు
By: Sivaji Kontham | 16 Sept 2026 9:21 AM ISTఅభిమాన హీరో ఎక్కడైనా కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయం సందర్భంతో ఫ్యాన్స్ కు పనే లేదు. తమ అభిమానాన్ని చాటుకోవడంలో వారు అన్ని హద్దులను దాటేస్తుంటారు. శవంతోనే సెల్ఫీలు దిగిన అభిమానం మనది. అంతేకాదు.. రోడ్లపై భారీగా గుమిగూడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం.. హీరోల కార్లను చుట్టుముట్టడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఈ వీరారాధన ఒక్కోసారి ప్రాణాలకే ముప్పుగా మారుతుండటంతో స్టార్ హీరోలు స్వయంగా రంగంలోకి దిగి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య తన కారు కదలలేనంతగా రోడ్డుపై అభిమానులు గుమిగూడటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ``నడిరోడ్డు మీద ఇదంతా ఏంటి? మీకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?`` అంటూ ఆయన కాస్త గట్టిగా అరుస్తూనే అభిమానులను హెచ్చరించారు. ఫ్యాన్స్ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఆయన చూపించిన ఆవేదన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం సూర్య మాత్రమే కాదు.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలు ఇదే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పరిస్థితి అదుపు తప్పడంతో నటులు భారీ భద్రతను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రత్యేకించి విదేశీ సెక్యూరిటీ సిబ్బందిని, ప్రైవేట్ బౌన్సర్‌లను మెయింటైన్ చేయాల్సి వస్తోంది. అలాగే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు కూడా తమ భద్రత కోసం ఎప్పుడూ పటిష్టమైన ప్రైవేట్ సెక్యూరిటీ వలయంలోనే ఉండాల్సి వస్తోంది. అభిమానుల తాకిడి ఒక్కోసారి విసిగించి వేధించే స్థాయికి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ వంటి అగ్ర హీరోలు చాలా సందర్భాలలో తమ అభిమానులను ప్రాణాలకు తెగించవద్దని.. ఎంతో క్షేమంగా ఇంటికి వెళ్లాల్సిందిగా ఎమోషనల్‌గా అభ్యర్థించారు. హీరోలు తమను ఇబ్బంది పెట్టాలని.. ఫ్యాన్స్ ఇబ్బందిపడాలని ఎప్పుడూ కోరుకోరు. అయినా అభిమానులు కనీస విజ్ఞతను విస్మరించి ప్రవర్తించడం వల్ల అటు హీరోలకు, ఇటు సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.
అభిమానం అనేది తప్పు కాదు కానీ దానిని ప్రదర్శించే విధానంలోనే అసలు ముప్పు దాగి ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలోనూ ఫ్యాన్స్ ఆలోచనా విధానంలో మార్పు రాకపోవడం గమనార్హం. స్టార్లు దీనిని అసలు కోరుకోవడం లేదని స్పష్టంగా తెలిసినా అదే పద్ధతిని కొనసాగించడం వల్ల పరిస్థితులు ఒక్కోసారి అదుపు తప్పుతుంటాయి. ఇప్పటికైనా అభిమానులలో పరివర్తన వచ్చి ప్రాణాలను పణంగా పెట్టకుండా సురక్షితమైన మార్గంలో తమ అభిమానాన్ని చాటుకుంటారని ఆశిద్దాం.
