స్టార్ హీరోల రిలీజులు గందరగోళంలో!
ఇదే ఏడాది పక్కాగా రిలీజ్ అవ్వాల్సిన స్టార్ హీరోల సినిమాలు చాలా ఉన్నాయి. కానీ వాటి రిలీజ్ లోనే క్లారిటీ లోపిస్తుంది.
By: Tupaki Desk | 13 May 2025 12:23 PM ISTఇదే ఏడాది పక్కాగా రిలీజ్ అవ్వాల్సిన స్టార్ హీరోల సినిమాలు చాలా ఉన్నాయి. కానీ వాటి రిలీజ్ లోనే క్లారిటీ లోపిస్తుంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. భారీ అంచనా లున్న సినిమా రిలీజ్ లపై స్పష్టత లేకపోవడంతో టైర్ -2, టైర్ -3 హీరోల చిత్రాలు ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో వాళ్లకు అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` జనవరిలో రిలీజ్ అనుకున్నారు.
కానీ రిలీజ్ అవ్వలేదు. వాయిదాకి ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి. చివరిగా తేలింది ఏంటంటే? సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో అనుకున్న టైమ్ లో ఆ పనులు పూర్తికాక వాయిదా వేసారు. ఇప్పటికీ సీజీ జరుగుతూనే ఉంది. జనవరి తర్వాత మార్చి, ఏప్రిల్ రిలీ్ అవుతుందన్నారు. అదీ జరగలేదు. కొత్తగా జూన్, ఆగస్టు...అక్టోబర్ అంటూ ప్రచారం మొదలైంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రాజాసాబ్ పరిస్థితి ఇంతే.
అదిగో రిలీజ్...ఇదిగో రిలీజ్ అనే ప్రచారం తప్ప రిలీజ్ అవ్వ డం జరగలేదు. ఆ సినిమా ఏ స్టేజ్ లో ఉందో? ఎలాంటి అప్ డేట్ లేదు. అలాగే యంగ్ హీరో తేజ సజ్జా `మిరాయ్` కూడా రిలీజ్ తేది రివీల్ చేయలేదు. సినిమాకి సంబంధించి అప్ డేట్ కూడా లేదు. ఇంకా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `ఘాటీ` రిలీజ్ పై స్ఫష్టత లేదు. చిత్రీకరణ పూర్తయిన యూనిట్ అంతా కామ్ గా ఉంది.
దీంతో బ్యాకెండ్ లో ఏం జరుగుతుందో తెలియలేదు. అలాగే మాస్ రాజా రవితేజ `మాస్ జాతర` మేకర్స్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమాల రిలీజ్ లపై ఓ క్లారిటీ వస్తే తదుపరి సినిమాలు ఎప్పుడు? రిలీజ్ డేట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
