Begin typing your search above and press return to search.

రాజమౌళి నాస్తికుడే, కానీ..!

ఈరోజు తన జన్మస్థలం సమీపంలోని బళ్లారిలో శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తన సతీమణితో కలిసి పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:47 PM GMT
రాజమౌళి నాస్తికుడే, కానీ..!
X

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. వందేళ్ల భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని సాకారం చేసిపెట్టిన గొప్ప దర్శకుడు రాజమౌళి. వెండితెర మీద విజువల్ వండర్స్ ను ఆవిష్కరించే జక్కన్న.. తనని తాను నాస్తికుడిగా చెప్పుకుంటారు. ప్రతి సినిమాలో ఏదొక సన్నివేశంలో దేవుడి గురించి తెలియజెప్పే ఆయన.. అసలు దేవున్నే నమ్మనని గతంలో చెప్పారు. అయితే ఇటీవల కాలంలో దర్శకుడిలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుతూ, పూజలు చేస్తూ ఆస్తికుడిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.

శ్రీశైల శ్రీ రాజమౌళి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందినదైనప్పటికీ, ఆయన మాత్రం కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలో జన్మించారు. ఈరోజు తన జన్మస్థలం సమీపంలోని బళ్లారిలో శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఇది 'ఈగ' నిర్మాత వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి నిర్మించిన టెంపుల్ అని సమాచారం. ఈ సందర్భంగా జక్కన్న ధోతీ కట్టుకొని ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి గతేడాది జూన్ లో కుటుంబసమేతంగా తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే. తంజావూరులోని బృహదీశ్వరాలయం, రామేశ్వరం, శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, కనడుకథన్‌, తూత్తుకూడి, మధురై దేవాలయాలను సందర్శించారు. తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్‌ చేశారు. ఇప్పుడు బళ్ళారిలో ఆలయంలో శివ లింగం ప్రాణప్రతిష్టలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఇదంతా చూస్తుంటే నాస్తికుడైన జక్కన్న ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తను దేవుడ్ని నమ్మనప్పటికీ కుటుంబ సభ్యుల నమ్మకానికి గౌరవమిచ్చి టెంపుల్స్ కు వెళ్తున్నారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ల్లో నాస్తికుడైన తన దగ్గరి బంధువు గుణ్ణం గంగ‌రాజుతో పని చేసినప్పుడు అయాన్ ర్యాండ్ బుక్ ఇచ్చాడ‌ని, అప్ప‌టి నుంచి తాను నాస్తికుడిగా మారినట్లు 'బాహుబ‌లి' ప్ర‌మోష‌న‌ల్ లో రాజమౌళి తెలిపారు. ఇప్పుడు ఏ విధంగా అయితే దేవడు, మతాలను చిత్రీకరించబడుతున్నాయో వాటిని తాను నమ్మనని RRR టైమ్ లో ఓ ఇంటర్వూలో చెప్పారు. "దేవడు ఉన్నాడని నమ్ముతారా? అని అడిగితే మాత్రం నాకు తెలియదనే చెప్తాను. విశ్వం మొత్తాన్నీ ఒక సూపర్ పవర్ కంట్రోల్ చేస్తుందని కొందరు అంటూంటారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లాంటివి నాకు ఎలాగైతే అర్థం కాదో, అది కూడా నాకు అర్థం కాదు. నాకు నిజంగా అర్థమైతే అవును కాదు అని సమాధానం చెప్తాను" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

రాజమౌళి తనని తాను నాస్తికుడుగా చెప్పుకుంటూ, తన సినిమాల్లో దేవుళ్ళ సన్నివేశాలు పెట్టడం.. గుళ్ళు గోపురాలు తిరగడంపై విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. దర్శకుడు అప్పట్లో మంత్రాలయం టెంపుల్ కు వెళ్ళడంపై, RRR ప్ర‌మోష‌న్స్ లో బాగంగా గురుద్వార్ వెళ్లి పూజ‌లు చేయడంపై బాబు గోగినేని లాంటి వారు కొందరు ట్రోలింగ్ చేశారు. "భక్తులకు నమ్మకంలో ఎలా నిజాయితీ ఉంటుందో, నాస్తికులు కూడా ఈ విషయంలో నిజాయితీ గా ఉండాలి. దేవుడిని, అదృశ్య శక్తులను నమ్మనప్పుడు పూజ చేసేది ఎవరికి? అది చేయడానికి గుడికి, గురుద్వారకు, నదికి వెళ్ళాలా?" అంటూ బాబు గోగినేని అప్పట్లో జక్కన్నపై సెటైర్ వేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్‌ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు జక్కన్న. ఈ గ్లోబ్ ట్రాటనింగ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని కోసం విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను సిద్దం చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మించనున్నారు.