Begin typing your search above and press return to search.

SS రాజ‌మౌళి ఆస్తి విలువ ఎంత‌?

సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా మారాడు ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి. అత‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే.

By:  Tupaki Desk   |   2 April 2024 4:36 AM GMT
SS రాజ‌మౌళి ఆస్తి విలువ ఎంత‌?
X

సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా మారాడు ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి. అత‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 చిత్రాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన రాజ‌మౌళి భార‌తీయ సినిమా తీరు తెన్నుల‌ను మార్చ‌డంలో కీల‌క భూమిక పోషించారు. పాన్ ఇండియన్ సినిమా అనే ప‌దానికి సిస‌లైన నిర్వ‌చ‌నం చెప్పిన ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి పేరు మార్మోగుతోంది.

ఇటీవ‌ల RRR చిత్రంతో క‌మర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డ‌మే గాక‌.. `నాటు నాటు` పాటకు ఆస్కార్ ని దేశానికి అందించిన తొలి ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి రికార్డుల‌కెక్కారు. బాహుబలి- RRR వంటి పాన్-ఇండియా చిత్రాల భారీ విజయంతో రాజమౌళి భార‌త‌దేశానికి ఇంటి పేరుగా మారారు. అత‌డికి అవ‌కాశం ఇవ్వాలే కానీ మార్వ‌ల్ త‌ర‌హా సినిమా తీయ‌గ‌ల‌డ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ద‌ర్శ‌కుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ గా బ‌హుముఖ ప్ర‌జ్ఞ ఆయ‌న సొంతం. అడ్వెంచర్ ఫాంటసీ జానర్ సినిమాలతో అద్భుతాలు చేసిన ద‌ర్శ‌కుడిగాను రాజ‌మౌళి పాపుల‌ర‌య్యారు. వినోద పరిశ్రమలో ఆయన చేసిన విశేష కృషిని దృష్టిలో ఉంచుకుని జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు ద‌క్కాయి. అయితే ఇన్నేళ్ల‌లో ఆయ‌న ఎంత సంపాదించుకున్నారు. నిక‌ర ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? అంటే తెలిసిన ఆస‌క్తిక‌ర‌ వివ‌రాలివి.

ఎస్.ఎస్.రాజమౌళి మొత్తం నికర ఆస్తుల విలువ 158కోట్లు (20మి.డాల‌ర్లు) ఉంటుంద‌ని అంచ‌నా. సినిమాల‌తో పాటు రాజ‌మౌళికి ర‌క‌ర‌కాల ఆదాయ వ‌న‌రులున్నాయి. ప్రధాన ఆదాయం సినిమాల నుంచే వ‌స్తుంది. ఇత‌ర‌త్రా వ్యాపారాల్లో పెట్టుబ‌డులు స‌హా ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు. హైదరాబాద్ మ‌ణికొండ స‌మీపంలో రాజమౌళికి విలాసవంతమైన బంగ్లా ఉంది. 2008లో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని ఇంటితో పాటు ఔట‌ర్ లో ఫామ్ హౌస్ లు, కొన్ని స్థ‌లాలు ఉన్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇతర నగరాల్లో కూడా అతడికి పలు అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఖ‌రీదైన కార్లు రాజ‌మౌళి గ్యారేజీలో ఉన్నాయి. రేంజ్ రోవర్ - BMW సహా కొన్ని విలాసవంతమైన కార్లు అతడి సొంతం. వీటి ధర కోట్ల‌లో ఉంది.

రాజమౌళి త‌దుప‌రి ఇండియానా జోన్స్ స్ఫూర్తితో భారీ అడ్వెంచ‌ర‌స్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. అలాగే నిర్మాత‌గా ప‌లు ప్రాజెక్టుల‌కు జ‌క్క‌న్న అండ‌గా నిలుస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా అనే కొత్త ప్రాజెక్ట్ కోసం రాజ‌మౌళి పని చేస్తున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పారితోషికం- వ్య‌క్తిగ‌త జీవితం:

బాహుబలి ఫ్రాంచైజీ కోసం రాజ‌మౌళి రూ. 25 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.100 కోట్లకు ఫీజు పెంచారు. రాజ‌మౌళి చిత్రాలలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, RRR, మగధీర, ఈగ లాంటి బ్లాక్ బస్ట‌ర్లు ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా, కల్కి 2898 ADలో అతిధి పాత్రల్లో క‌నిపిస్తార‌ని స‌మాచారం.

రాజమౌళి 10 అక్టోబర్ 1973న తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏలూరులోని CR రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. అతడు 2001లో రమా రాజమౌళిని పెళ్లాడారు. ఈ దంపతులకు SS కార్తికేయ, SS మయూఖ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.