మహేష్ సెట్ బడ్జెట్.. టాలీవుడ్‌లో నెవ్వర్ బిఫోర్
భారీ కాన్వాసుతో ఒక కథను ఎంపిక చేయడం, దానిని కళాత్మక పంథాలో రూపొందించేందుకు భారీ సెట్లు వేయడం సంజయ్ లీలా భన్సాలీకి అలవాటు.
By: Tupaki Desk | 19 Jun 2025 9:55 AM ISTభారీ కాన్వాసుతో ఒక కథను ఎంపిక చేయడం, దానిని కళాత్మక పంథాలో రూపొందించేందుకు భారీ సెట్లు వేయడం సంజయ్ లీలా భన్సాలీకి అలవాటు. ఆయన `దేవదాస్` సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ తో భారీ సెట్ నిర్మించారని అప్పట్లో కథనాలొచ్చాయి. అతడు తెరకెక్కించిన చాలా సినిమాలకు 10 నుంచి 30కోట్ల మధ్యలో బడ్జెట్లను సెట్స్ నిర్మాణం కోసం ఖర్చు చేసారు. భాజీరావు మస్తానీ, ప్రేమ్ లీలా ధన్ పాయో, రామ్ లీలా, హీరామండి ఇవన్నీ ఇదే కేటగిరీకి చెందినవి.
భన్సాలీ తరహాలోనే భారీ సెట్లు నిర్మించే అలవాటు టాలీవుడ్ లో గుణశేఖర్ కి ఉంది. ఆయన ఎంపిక చేసుకునే కథాంశాలు అలాంటివి. ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్ భారీతనం నిండిన సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేయించారు. పౌరాణిక నేపథ్యం ఉన్న కథలతో సినిమాలు చేయాలనుకున్నా, ఆయన సెట్లకు బడ్జెట్లతో సమస్య తలెత్తిన కారణంగా సినిమాలు ఆగిపోయిన సందర్భాలున్నాయి. రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్ లభించకపోవడంతో ఆ సినిమా ఔట్ పుట్ ఎలా వచ్చిందో తెలిసిందే.
ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఆర్థిక వనరుల పరంగా ఎలాంటి సమస్యా లేదు. ఆయన తన సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారని తెలిసింది. మహేష్ కథానాయకుడిగా అతడు రూపొందిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ- ఎస్.ఎస్.ఎం.బి 29 కోసం 50 కోట్ల బడ్జెట్ తో వారణాసి సెట్ నిర్మిస్తున్నారని తెలిసింది. నిజానికి గంగా నది ఒడ్డున రియల్ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే అది సవాల్ తో కూడుకున్నది. పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు. దాంతో పాటు, ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.
అందుకే రాజమౌళి వారణాసిని తలపించే ఓ భారీ సెట్ ని నిర్మించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. వారణాసి అంటే దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రదేశం. అలాంటి మరో నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నది. ఒరిజినాలిటీ చెడకుండా దానిని చూపించాలి. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ సమక్షంలో రాజమౌళి పని చేస్తున్నారని తెలిసింది. అడవిలో పర్వతాలలో సంజీవని వనమూలికను వెతకడానికి వెళ్లిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని టాక్ వినిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
