Begin typing your search above and press return to search.

మొదటి రోజు రూ.300 కోట్లు కొట్టే సినిమా.. ఇంకొక్క ఏడాది!

తాజాగా ఆయన కూడా పోస్ట్ పెట్టారు. "ప్రపంచం ఇంకా సిద్ధంగా లేని ఒక సంచలనం.. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో' ప్రపంచ సినిమా రంగంపై తన ఆధిపత్యాన్ని చాటబోతోంది.

By:  M Prashanth   |   7 April 2026 3:01 PM IST
మొదటి రోజు రూ.300 కోట్లు కొట్టే సినిమా.. ఇంకొక్క ఏడాది!
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి విడుదలకు కౌంట్‌ డౌన్ మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉండటంతో.. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. ఇంకో ఏడాది తర్వాత ఇదే రోజు వారణాసి షో టైం అంటూ ప్రకటిస్తూ, సినిమా విడుదలలో ఎటువంటి ఆలస్యం ఉండదని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో వేగంగా కొనసాగుతోంది.

మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా సహా ఇతర కీలక తారాగణంపై ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వారణాసి సాధారణ యాక్షన్ సినిమా కాకుండా, ఒక గ్లోబల్ అడ్వెంచర్‌ గా తెరకెక్కుతోంది.

వారణాసి నగరంలోని పురాతన రహస్యాలు, అంటార్కిటికాలోని మంచు ప్రాంతాలు, ఆఫ్రికా అడవులు వంటి విభిన్న ప్రదేశాల్లో కథ సాగుతుందని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ విలువలతో సినిమా రూపొందిస్తున్నారు. చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ కూడా పొందారు. కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్సులతో ఆయన అభిమానులను ఆకట్టుకోనున్నారు.

తాజాగా ఆయన కూడా పోస్ట్ పెట్టారు. "ప్రపంచం ఇంకా సిద్ధంగా లేని ఒక సంచలనం.. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో' ప్రపంచ సినిమా రంగంపై తన ఆధిపత్యాన్ని చాటబోతోంది. వారణాసి మూవీ.. ఏప్రిల్ 7, 2027 నుంచి రుద్ర ఆగమనం.. మరో ఒక్క సంవత్సరంలో" అంటూ రాసుకొచ్చారు. అయితే సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వ్యయంతో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి.. వారణాసితో మరింత పెద్ద రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విడుదల రోజునే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా మరో ఏడాదిలో థియేటర్లలో సందడి చేయబోతున్న వారణాసిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ లోపు టీజర్లు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలతో ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.