1600 కోట్ల బడ్జెట్ సరే.. రాజమౌళిలా తీయగలడా?
ఇప్పుడు రామాయణం లాంటి పురాణేతిహాస కథను ఎంపిక చేసుకున్న నితీష్ తివారీ శ్రీరాముని జననం జీవితకథలో ఔచిత్యాన్ని నేటితరానికి అందించడంలో సఫలమవ్వాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 6 July 2025 4:00 AM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నేడు భారతదేశంలో నంబర్ వన్ దర్శకుడిగా వెలిగిపోతున్నాడు. బాహుబలి- బాహుబలి -2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల అసాధారణ విజయాలతో అతడికి ఈ హోదా దక్కింది. భారతదేశానికి తొలి ఆస్కార్ ని అందించిన దర్శకుడిగాను అతడి పేరు మార్మోగింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాల్ని అందించడంతో అతడికి గొప్ప గుర్తింపు దక్కింది.
అయితే ఇప్పుడు `రామాయణం` ఫ్రాంఛైజీతో ఆ స్థాయిని అందుకోవాలని కలలు కంటున్నాడు నితీష్ తివారీ. దంగల్ లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితీష్ ఈసారి పురాణేతిహాస కథతో ప్రపంచ ఆడియెన్ కి కనెక్ట్ అవ్వాలని భావిస్తున్నారు. రణబీర్ లాంటి ప్రతిభావంతుడిని శ్రీరాముడి పాత్రలో అతడు ఆవిష్కరిస్తున్నాడు. రామాయణం మొదటి భాగం చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి అద్భత స్పందన వచ్చింది. అయితే ఇది పూర్తిగా వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యతతో కూడుకున్న టీజర్. ఇందులో చివరి 2 సెకన్లలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా విల్లంబులు అందుకుని బాణం సంధించే దృశ్యంతో లార్జర్ దేన్ లైఫ్ పాత్రతో ఫిలింమేకింగ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతున్నాడని నమ్మకాన్ని ఇచ్చాడు. వీఎఫ్ఎక్స్ ఎంత గొప్పగా ఉన్నా ఆ క్రెడిట్ దర్శకుడికి చెందదు. అతడు పాత్రల చిత్రణను, మొత్తం కథనాన్ని నడిపించే విధానం, కథలో మలుపులు, భీకరమైన పోరాట దృశ్యాలు, ఉద్వేగాల్ని పండించే సన్నివేశాలతో రక్తి కట్టించాల్సి ఉంటుంది.
అయితే ఇలాంటి విషయాలలో రాజమౌళి మాస్టర్ క్లాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామాయణం లాంటి పురాణేతిహాస కథను ఎంపిక చేసుకున్న నితీష్ తివారీ శ్రీరాముని జననం జీవితకథలో ఔచిత్యాన్ని నేటితరానికి అందించడంలో సఫలమవ్వాల్సి ఉంటుంది. భారతదేశంలోని 100 కోట్ల ప్రజలకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ని అతడు అద్భుతంగా మలచాల్సి ఉంటుంది. అయితే అతడు చేస్తున్న ఈ సాహసానికి ఏకంగా 1600 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇది రెండు భాగాలకు కలిపి బడ్జెట్. దీనికి రెండుసార్లు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ నేపథ్య సంగీతం అందిస్తుండగా, మరో ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ పాటల్ని అందిస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తుండడంతో ఇంతటి భారీ బడ్జెట్ ఖర్చు కానుంది. స్టార్ కాస్టింగ్, కాస్ట్యూమ్స్, కళాత్మక సెట్లను రూపొందించేందుకే భారీగా ఖర్చవుతుంది.
రామాయణం పార్ట్ 1 కి దాదాపు 900 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుండగా, పార్ట్ 2 కోసం 700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. పార్ట్ 1 కి ఉపయోగించే భారీ సెట్లను రెండో భాగం చిత్రీకరణ కోసం ఉపయోగిస్తారు కాబట్టి ఆ మేరకు మొదటి భాగం కంటే రెండో భాగానికి ఖర్చు తగ్గుతుందని చెబుతున్నరు. ఏది ఏమైనా బడ్జెట్ లెక్కలను హైప్ చేసి చెబుతున్నారా? లేక నిజంగానే అంత పెద్ద బడ్జెట్లు పెడుతున్నారా? అన్నది మొదటి ట్రైలర్ వచ్చే వరకూ అంచనా వేయలేం. దానికి ఇంకా చాలా సమయం ఉంది. 2026లో `రామాయణం` మొదటి భాగం రిలీజయితే, 2027లో రెండో భాగం రిలీజవుతుంది.