Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి RRR స్ఫూర్తితో సాహ‌సం?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి భార‌తీయ సినిమా ఎదుగుద‌ల‌, అభివృద్దికి దిశానిర్ధేశ‌నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2025 10:29 PM IST
రాజ‌మౌళి RRR స్ఫూర్తితో సాహ‌సం?
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి భార‌తీయ సినిమా ఎదుగుద‌ల‌, అభివృద్దికి దిశానిర్ధేశ‌నం చేస్తున్నారు. ఆయ‌న బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో ప్ర‌పంచానికి భార‌తీయ సినిమా గొప్ప‌త‌నాన్ని ప‌రిచ‌యం చేసారు. ఆ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో దానిని ప‌తాక స్థాయికి తీసుకుని వెళ్లారు. హాలీవుడ్ స్థాయిలో భారతీయులు కూడా సినిమాలు తీయ‌గ‌ల‌ర‌ని నిరూపించారు జ‌క్క‌న్న‌. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఆస్కార్-గోల్డెన్ గ్లోబ్స్- హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల్ని ద‌క్కించుకోవ‌డంతో ప్ర‌పంచం దృష్టి ఇటువైపు మ‌ర‌లింది. అప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మీడియా భార‌తీయ సినిమా వైపు చూడ‌టం, ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాల‌కు జాతీయ మీడియాలు ఇస్తున్న క‌వ‌రేజీ చూస్తుంటే ఆశ్చర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇదంతా రాజ‌మౌళి చ‌లువే. ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తితోనే దేశంలోని ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్స్ ప్ర‌పంచ స్థాయి సినిమాల‌ను నిర్మించాల‌నే క‌సితో ముందుకు వ‌స్తున్నారు.

ఇప్పుడు అలాంటి వారిలో ఒక‌రు న‌మిత్ మ‌ల్హోత్రా. ఆయ‌న కూడా రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ స్ఫూర్తితోనే రామాయ‌ణం ఫ్రాంఛైజీ చిత్రాల‌ను ప్రారంభించాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. హాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను సైతం ఆర్.ఆర్.ఆర్ ఆక‌ర్షించింది. ఆ స్థాయి ప్ర‌మాణాల‌తో అల‌రించింద‌ని న‌మిత్ అన్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, గాంధీ వంటి చిత్రాలు ప్రపంచానికి భారతీయ కథలను ప‌రిచయం చేసినా కానీ, ఆర్.ఆర్.ఆర్ ఒక కొత్త దృక్పథాన్ని పరిచయం చేసిందని తాను నమ్ముతున్నానని న‌మిత్ తెలిపారు. RRR భారతీయ కథల బలం, గొప్పతనాన్ని గుర్తించ‌డానికి స‌హ‌క‌రించింద‌ని, అదే రాజమౌళి సాధించిన‌ నిజమైన విజయమని ఆయన అన్నారు.

భార‌తీయుల‌ను పేదలుగా చూసే హాలీవుడ్ కి మ‌న‌మేంటో చూపించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ని నమిత్ అన్నారు. భారతదేశం శక్తివంతమైనదని, రామాయణం ప్రపంచ పరిణామానికి మూలం అని తాను న‌మ్ముతున్న‌ట్టు అత‌డు చెప్పారు. ప్రపంచంలోని గొప్ప పౌరాణిక కథలలో ఒకటి అయిన రామాయ‌ణాన్ని సినిమాలుగా ప్ర‌పంచానికి అందిస్తే విజ‌యం త‌థ్య‌మ‌నే భావ‌న ఇప్పుడు ప్ర‌జ‌ల్లో క‌లిగింది. రామాయ‌ణం ఫ్రాంఛైజీలో రెండు భాగాల కోసం న‌మిత్ మ‌ల్హోత్రా- య‌ష్ బృందాలు దాదాపు 4000 కోట్లు కేటాయించ‌డం ఇటీవ‌ల హాట్ టాపిగ్గా మారింది. ఇది ఒక హాలీవుడ్ సినిమా బ‌డ్జెట్ కి ఎంత‌మాత్రం త‌క్కువ కాదు. ఇటీవ‌ల విడుద‌లైన‌ రామాయ‌ణం టీజ‌ర్ గ్లింప్స్ ప్ర‌పంచం దృష్టిని గొప్ప‌గా ఆక‌ర్షించ‌డంలో, న‌మ్మ‌కాన్ని పెంచ‌డంలో స‌ఫ‌ల‌మైంది. నితీష్ తివారీ ఈ పురాణేతిహాస క‌థ‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.