Begin typing your search above and press return to search.

AI కథలు రాస్తుంది కానీ ఇలాంటివి చేయ‌గ‌ల‌దా?

డైరెక్ట‌ర్ ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల ఓ సంద‌ర్భంలో తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 July 2026 4:00 AM IST
AI కథలు రాస్తుంది కానీ ఇలాంటివి చేయ‌గ‌ల‌దా?
X

సినిమా నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగులు వేగంగా పడుతున్నాయి. కథల ఐడియాల నుంచి సీన్స్ క్రియేష‌న్ వరకు, పాత్రల ప్రవర్తన నుంచి ప్రేక్షకుల అభిరుచుల అంచనా వరకు ఎన్నో రంగాల్లో ఏఐ ఉపయోగం పెరుగుతోంది. అయినప్పటికీ, సినీ హిస్ట‌రీ లో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ఇప్పటికీ హ్యూమ‌న్ ఎక్స్‌పీరియెన్స్, అంతర్దృష్టి, ఎమోష‌న్స్ పై ఉన్న అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది.

డైరెక్ట‌ర్ ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల ఓ సంద‌ర్భంలో తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. సింహాద్రి సినిమాలో కీలకమైన ఒక సీన్ విషయంలో తన క్రియేటివ్ టీమ్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేసిందని, ఆ డెసిష‌న్ ఆడియ‌న్స్ కు అంగీకారయోగ్యంగా ఉండదని అభిప్రాయపడిందని ఆయన వెల్లడించారు. అయితే ఆ సీనే కథకు అసలు బలం ఇస్తుందని తనకు గట్టి నమ్మకం ఉండటంతో, త‌న డెసిష‌న్ ను మార్చుకోకుండా ముందుకు వెళ్లానని చెప్పారు. సినిమా రిలీజైన‌ తర్వాత అదే సీన్ ఆడియ‌న్స్ నుంచి విశేష స్పందన అందుకుని సినిమా స‌క్సెస్ కు కీలకంగా మారిందని ఆయన గుర్తుచేశారు.

ఈ ఉదాహరణ మరోసారి ఒక ఆసక్తికర ప్రశ్నను ముందుకు తెస్తోంది. లక్షలాది సినిమాల డేటాను విశ్లేషించే ఏఐ కూడా ఒక సీన్ రిస్కీ అని చెప్పగలదు. ఆడియ‌న్స్ ఎలా రెస్పాన్స్ అవుతారో కూడా అంచనా వేయగలదు. కానీ కథలోని ఎమోష‌న‌ల్ డెప్త్, క్యారెక్ట‌ర్ జ‌ర్నీ, థియేటర్‌లో కలిగే అనుభూతిని నమ్మి ఆ రిస్క్‌ను స్వీకరించే ధైర్యాన్ని మాత్రం ఏఐ ఇవ్వలేదు.

సినీ హిస్ట‌రీని పరిశీలిస్తే మొదట అనుమానాలకు గురై, తర్వాత క్లాసిక్‌లుగా నిలిచిన ఎన్నో సీన్స్ కనిపిస్తాయి. అవన్నీ డేటా ఆధారంగా కాకుండా, డైరెక్ట‌ర్ లేదా రైట‌ర్ తమ నమ్మకాన్ని విశ్వసించి తీసుకున్న నిర్ణయాలే. ప్రేక్షకులు కూడా చాలాసార్లు లాజిక్ కంటే ఎమోషన్‌తోనే సినిమాలను గుర్తుంచుకుంటారు. అందుకే ఏఐ సినిమా నిర్మాణంలో శక్తివంతమైన సహాయక సాధనంగా మారినా, ఫైన‌ల్ క్రియేటివ్ డెసిష‌న్ మాత్రం ఇప్పటికీ మనిషి చేతుల్లోనే ఉంది. కథ ఎక్కడ మలుపు తిరగాలి, ఆడియ‌న్ ఎక్కడ కదిలిపోవాలి, ఏ సీన్ సినిమాకు సోల్ గా నిలవాలి అనే విషయాలను అల్గారిథమ్ పూర్తిగా డిసైడ్ చేయ‌లేద‌ని రాజమౌళి షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియెన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. టెక్నాల‌జీ ఎంత ముందుకు వెళ్లినా, ఒక గొప్ప సినిమా వెనుక చివరికి నిలిచేది డేటా కాద‌ని, దాన్ని సృష్టించిన వారికి తన కథపై ఉండే అచంచల విశ్వాసమేన‌ని ఈ విష‌యం మ‌రోసారి నిరూపిస్తోంది.