షారూఖ్ - దాదా ఆత్మీయ ఆలింగనం వెనుక అసలు కథ
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిన సంగత తెలిసిందే.
By: Sivaji Kontham | 7 April 2026 7:37 PM ISTఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిన సంగత తెలిసిందే. నిరంతరాయంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఈ నిరాశలోనూ ఒక మధుర దృశ్యం మైదానంలో ఆవిష్కృతమైంది. తన జట్టుకు మద్దతుగా కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ప్రత్యక్షమైన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని కలవడం అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది.
ఐపీఎల్ చరిత్రను గమనిస్తే షారూఖ్- గంగూలీల మధ్య అనుబంధం చాలా లోతైనది. 2008లో లీగ్ ప్రారంభమైనప్పుడు కేకేఆర్ జట్టుకు గంగూలీ ఐకాన్ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2010లోనూ ఆయన జట్టును ముందుండి నడిపారు. అయితే 2011లో ఫ్రాంచైజీ గంగూలీని వదులుకోవడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, సంబంధాలు దెబ్బతిన్నాయని అనేక వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈడెన్‌లో వీరిద్దరూ ఒకరినొకరు హత్తుకున్న తీరు ఆ వార్తలన్నీ అవాస్తవాలని తేల్చిచెప్పింది.
ప్రస్తుతం సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సిఏబి) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. షారూఖ్ జట్టు యజమాని హోదాలో స్టేడియానికి వచ్చారు. ఈ ఇద్దరు దిగ్గజాలు పాత మనస్పర్థలను పక్కన పెట్టి.. ఎంతో ఆత్మీయంగా పలకరించుకోవడం చూసి క్రీడాలోకం మురిసిపోతోంది. ఈ హగ్ కేవలం ఒక ఫోటో షూట్ కోసం జరిగింది కాదు.. అది ఒక పాత స్నేహానికి .. పరస్పర గౌరవానికి నిదర్శనం. మైదానంలో టీమ్ ఇండియా పేసర్ హర్షిత్ రాణా కూడా వారితో చేరడంతో ఆ క్షణం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ భావోద్వేగపూరితమైన కలయిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేకేఆర్ అభిమానుల నుంచి ఒక కొత్త డిమాండ్ వినిపిస్తోంది. గంగూలీని తిరిగి కేకేఆర్ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా కీలక బాధ్యతల్లోకి తీసుకోవాలని లక్షలాది మంది కోరుకుంటున్నారు. గంగూలీ అనుభవం జట్టుకు తోడైతే కేకేఆర్ మరిన్ని అద్భుతాలు చేస్తుందని వారు ఆశిస్తున్నారు. కింగ్ ఖాన్ - దాదా మధ్య ఉన్న ఈ స్నేహబంధం కేకేఆర్ భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
సినిమాల పరంగా చూస్తే.. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం `కింగ్` కోసం కఠినంగా శ్రమిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ఆయన వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఒకవైపు క్రికెట్ మైదానంలో జట్టు యజమానిగా.. మరోవైపు వెండితెరపై నటుడిగా షారూఖ్ తన మార్క్ చూపిస్తూనే ఉన్నారు. దాదాపు 14000 కోట్ల ఆస్తులకు యజమానిగా ఖాన్ పేరు మార్మోగుతోంది.
