కింగ్ వర్సెస్ కిల్లర్.. ఎవరిది పైచేయి?
మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందనున్న ఈ చిత్రంలో కింగ్ ఖాన్ కి సరైన ప్రతినాయకుడు అవసరం. ఈ పాత్ర కోసం కిల్ ఫేం రాఘవ్ జుయల్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 May 2025 8:00 PM ISTకింగ్ ఖాన్ షారూఖ్ కథానాయకుడిగా నటిస్తున్న 'కింగ్' 2026 మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఇటీవలే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో షారూఖ్ నటవారసురాలు సుహానా వెండితెర ఆరంగేట్రం చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ది ఆర్చీస్ తర్వాత సుహానాకు తొలి పెద్దతెర అవకాశమిది.
ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ సెలక్షన్ అంతకంతకు వేడెక్కిస్తోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నటీనటుల ఎంపిక విషయంలో ఏమాత్రం రాజీకి రాకపోవడంతో ఇది భారీ మల్టీస్టారర్ గా రూపాంతరం చెందుతోందని బాలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది. ఈ చిత్రంలో జైదీప్ అహ్లవత్, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, అభయ్ వర్మ వంటి టాప్ స్టార్లు నటిస్తున్నారు. వీళ్లతో సరిపుచ్చడం లేదు. ప్రాజెక్ట్ వ్యాల్యూని పెంచే మరింత మంది స్టార్లను కూడా ఎంపిక చేస్తున్నాడు.
మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందనున్న ఈ చిత్రంలో కింగ్ ఖాన్ కి సరైన ప్రతినాయకుడు అవసరం. ఈ పాత్ర కోసం కిల్ ఫేం రాఘవ్ జుయల్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది. రాఘవ్ జుయల్ కిల్ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. అతడికి కింగ్ గేమ్ ఛేంజర్ గా మారనుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రధాన విలన్ గా నటిస్తుండడం కూడా ఆసక్తిని పెంచుతోంది. గత సంవత్సరం 'కిల్'లో తన నటనతో రాఘవ్ జుయల్ ఒక ముద్ర వేశాడు. యుధ్రాలోను ప్రతినాయకుడి షేడ్స్ ఉన్న పాత్రను రిపీట్ చేసాడు.
ఈ సినిమాలో అతడి నటనకు ప్రశంసలు కురిసినా కానీ ఆశించిన విజయం దక్కలేదు. ఇలాంటి సమయంలో రాఘవ్ కి కింగ్ గొప్ప అవకాశం. అతడు తనను తాను నిరూపించుకుని ముందుకు వెళ్లేందుకు ఛాన్సుంటుంది. మే 21న కింగ్ చిత్రీకరణ అధికారికంగా ముంబైలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాల్సి ఉన్నా, ఆ తర్వాత సిద్ధార్థ్ బరిలోకి వచ్చాడు. అతడు రావడంతోనే ఈ మూవీ బడ్జెట్ కూడా అమాంతం పెరిగింది. యాక్షన్ కంటెంట్ విషయంలోను అతడు రాజీకి రావడం లేదని సమాచారం. షారూఖ్ స్టార్ డమ్ కి ఏమాత్రం తగ్గని రీతిలో అతడు ఈ సినిమాని తెరకెక్కించనుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
