అందుకే హిట్3 చేశా
కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లోకి ఎంటరై ఇక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది.
By: Tupaki Desk | 21 April 2025 3:00 PM ISTకెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లోకి ఎంటరై ఇక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. హిట్3 సినిమాతో శ్రీనిధి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న హిట్: ది థర్డ్ కేస్ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించింది.
హిట్ యూనివర్స్ లో భాగంగా శైలేష్ కొలను ఇప్పటికే రెండు సినిమాలు తీసి ఆ రెండు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మూడో సినిమాను నాని హీరోగా చేస్తున్నాడు. ఆ సినిమాలో శ్రీనిధి శెట్టి నానికి జోడీగా కనిపించనుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా హిట్3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనిధి శెట్టి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. ఈ సందర్భంగా అసలు తాను హిట్3 సినిమా చేయడానికి గల కారణాన్ని తెలిపింది. హిట్3 స్క్రిప్ట్ తన వద్దకు వెళ్లగానే అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చేశానని, నాని అంటే ఓ బ్రాండ్ అని, ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా వెంటనే ఒప్పుకోవాలని నానికి నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చింది శ్రీనిధి.
హిట్3లో శ్రీనిధి, నాని భార్య పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటివరకు తన పాత్రకు సంబంధించిన వివరాలేమీ పెద్దగా బయటకు రాలేదని, సినిమాలో తనది ఎంతో స్ట్రాంగ్ క్యారెక్టర్ అని, ఈ సినిమా చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రీనిధి శెట్టి తెలిపింది. అర్జున్ సర్కార్ గా నాని తన కెరీర్లోనే మొదటిసారి పోలీస్ గా కనిపించననున్నాడు.
ఆల్రెడీ హిట్3 పై మంచి బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ లో హిట్3 ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, టికెట్లు బాగా అమ్ముడయ్యాయి. ఒక్క రోజులోనే హిట్3 75 వేల డాలర్లు కలెక్ట్ చేయడం చూస్తుంటే సినిమా తక్కువ టైమ్ లోనే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే నాని ఖాతాలో ఎన్నో వన్ మిలియన్ డాలర్ సినిమాలున్న విషయం తెలిసిందే. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఈ సినిమాతో కూడా హిట్ అందుకుని తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.
