Begin typing your search above and press return to search.

చ‌ద‌రంగంలో పాము మింగేసిన న‌టి!

అదృష్టం - దుర‌దృష్టం గురించి మాట్లాడాల్సి వ‌స్తే ముందుగా ఈ అమ్మ‌డి గురించి మాట్లాడాలి.

By:  Tupaki Desk   |   24 April 2025 8:16 PM IST
చ‌ద‌రంగంలో పాము మింగేసిన న‌టి!
X

అదృష్టం - దుర‌దృష్టం గురించి మాట్లాడాల్సి వ‌స్తే ముందుగా ఈ అమ్మ‌డి గురించి మాట్లాడాలి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియ‌న్ హిట్ సినిమాలో న‌టించాక కూడా ఇన్నేళ్ల త‌ర్వాతా స్టార్ డ‌మ్‌ని త‌న సొంతం చేసుకోవ‌డంలో త‌డ‌బ‌డిన శ్రీ‌నిధి శెట్టి నిజంగా దుర‌దృష్ట నాయిక‌. ఒక సాధార‌ణ‌మైన `ఛ‌లో` సినిమాతో హిట్టందుకుని ఆ త‌ర్వాత ర‌య్ ర‌య్ మంటూ దూసుకుపోయిన రష్మిక మంద‌న్న‌తో పోలిస్తే శ్రీ‌నిధి శెట్టి స్టార్ డ‌మ్ ప‌రంగా చాలా దిగువ‌కు ప‌డిపోయింది.

దుర‌దృష్టం అంటే ప‌ది మెట్లు ఎక్కిన త‌ర్వాత కూడా ఒక‌టో మెట్టు మీదికి కాలు జార‌డం! ఇప్పుడు అలాంటి స్థితినే అనుభ‌విస్తోంది శ్రీ‌నిధి శెట్టి. అందానికి అందం, ప్ర‌తిభ.. ఎన్ని ఉన్నా అదృష్టం క‌లిసి రాలేదు. కేజీఎఫ్- కేజీఎఫ్ 2 త‌ర్వాత‌ ఈ అమ్మ‌డికి స‌రైన సినిమా ప‌డ‌లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ `హిట్` సిరీస్ లోని మూడో చిత్రంలో న‌టించే అవ‌కాశం అందుకుంది. ఈ సినిమా మే1న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ లో ఉన్న శ్రీ‌నిధి అవాక్క‌య్యే మ‌రో సంగ‌తి కూడా చెప్పింది. రామాయ‌ణంలో సీత‌గా త‌న‌కు అవ‌కాశం వ‌చ్చినా కానీ, దుర‌దృష్టం మ‌ళ్లీ త‌న‌ను మ‌ళ్లీ ఎలా కాలు ప‌ట్టి గుంజిందో వివ‌రించింది.

నితీష్ తివారీ `రామాయ‌ణం` చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తుండ‌గా, తొలిగా ఈ సినిమాలో సీత పాత్ర‌లో న‌టించాల్సిందిగా శ్రీ‌నిధి శెట్టికి ఆఫ‌ర్ వ‌చ్చింది. స్క్రీన్ టెస్ట్ లో కూడా పాల్గొంది. సీన్స్ లోను న‌టించేందుకు సిద్ధ‌మైంది. కానీ ఇంత‌లోనే త‌న ఫేట్ మారిపోయింది. ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ య‌ష్ రావ‌ణాసురుడిగా ఎంట్రీ ఇస్తుండ‌డంతో త‌న‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు దూరం పెట్టారు. రావ‌ణుడి ముందు సీత‌లా శ్రీ‌నిధి క‌నిపించ‌డం బావుండ‌ద‌నేది మేక‌ర్స్ అభిప్రాయం కావొచ్చు. కేజీఎఫ్ ఫ్రాంఛైజీలో ప్రేమికులుగా క‌నిపించిన య‌ష్‌- శ్రీ‌నిధిశెట్టి ఇప్పుడు పురాణేతిహాసంలో బ‌ద్ధ విరోధులుగా క‌నిపిస్తే అది ఆడియెన్ లోకి త‌ప్పుడు సంకేతాన్ని పంపిస్తుంద‌ని చిత్ర‌బృందం సందేహించింది. అందుకే ఆ త‌ర్వాత సాయిప‌ల్ల‌విని సీత పాత్ర‌కు ఎంపిక చేసుకున్నార‌ని కూడా శ్రీ‌నిధి తెలిపింది.

నిజానికి ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి పెద్ద స్టార్ స‌ర‌స‌న అవ‌కాశాన్ని దుర‌దృష్ట‌వ‌శాత్తూ శ్రీ‌నిధి కోల్పోయింది. పాము - నిచ్చెన‌ల చ‌ద‌రంగంలో పాము మింగేయ‌డం అంటే ఇదే! దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఛాన్స్ మిస్స‌యినా సీత పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి స‌రైన ఎంపిక అని శ్రీ‌నిధి కితాబిచ్చి త‌న మంచి మ‌న‌సును చాటుకుంది. ఇదే పాజిటివీటీతో ముందుకు వెళితే శ్రీ‌నిధికి మునుముందు మంచి అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్సుంది. హిట్ 3 విజ‌యం త‌న కెరీర్ కి చాలా కీల‌కం కానుంది. శైలేష్ కొల‌ను ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.