Begin typing your search above and press return to search.

తప్పు ఎక్కడ జరిగింది శ్రీనిధి...?

హిట్‌ 3 మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కొన్ని కారణాల వల్ల ఆమెకు ఆశించిన స్థాయిలో రీచ్‌ రాలేదు. హిట్‌ 3 కారణంగా శ్రీనిధి శెట్టికి ఒక్కటంటే ఒక్క ఆఫర్‌ కూడా వచ్చిన దాఖలాలు లేవు అని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

By:  Tupaki Desk   |   19 Jun 2025 11:00 AM IST
తప్పు ఎక్కడ జరిగింది శ్రీనిధి...?
X

కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడంతోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2016 లో మిస్ సుప్రానేషనల్ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలోనే ఈ అమ్మడికి కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చాయి. చిన్న ఆఫర్లను సున్నితంగా తిరష్కరించి యశ్‌ కి జోడీగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన 'కేజీఎఫ్‌' సినిమాలో నటించింది. కేజీఎఫ్‌ మొదటి పార్ట్‌లో శ్రీనిధి శెట్టి పాత్ర పెద్దగా లేదు. అయినా కూడా ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ కేజీఎఫ్‌ 2 విడుదల అయిన తర్వాతే తాను కొత్త సినిమాలకు కమిట్‌ అవుతాను అంటూ భీష్మించుకు కూర్చుకుంది. దాంతో చాలా కన్నడ సినిమా ఆఫర్లతో పాటు ఇతర భాషల సినిమా ఆఫర్లు కూడా చేజార్చుకుంది.

కేజీఎఫ్ 2లో కూడా శ్రీనిధి శెట్టి పాత్ర అంతంత మాత్రమే. అయినా కూడా ఆ సినిమా దక్కించుకున్న విజయం నేపథ్యంలో పాన్‌ ఇండియా రేంజ్‌లో శ్రీనిధి శెట్టికి మంచి గుర్తింపు దక్కింది. దాంతో ఆఫర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఈమె పాత్రల ఎంపిక విషయంలో అతి జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌ 2 సినిమా సమయంలోనే తమిల స్టార్‌ హీరో విక్రమ్‌తో కలిసి కోబ్రా సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది, దాంతో ఆ సినిమాను కనీసం చెప్పుకునే పరిస్థితి శ్రీనిధి శెట్టికి లేదు. కేజీఎఫ్ సమయంలో వరుసగా ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోని శ్రీనిధి శెట్టి కోబ్రా తర్వాత ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. లక్కీగా తెలుగులో ఈ అమ్మడికి రెండు ఆఫర్లు వచ్చాయి.

నానికి జోడీగా హిట్‌ 3 లో నటించే అవకాశం దక్కించుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సినిమా తెలుసు కదా లో ఇద్దరు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా నటించింది. హిట్‌ 3 మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కొన్ని కారణాల వల్ల ఆమెకు ఆశించిన స్థాయిలో రీచ్‌ రాలేదు. హిట్‌ 3 కారణంగా శ్రీనిధి శెట్టికి ఒక్కటంటే ఒక్క ఆఫర్‌ కూడా వచ్చిన దాఖలాలు లేవు అని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. తెలుసు కదా సినిమాలో నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెట్టుకుంది. యూత్‌ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న సిద్దు జొన్నలగడ్డ కచ్చితంగా ఈ సినిమాతో సాలిడ్‌ సక్సెస్‌ను అందుకుంటాడనే విశ్వాసం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. అందుకే తెలుసు కదా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది. ఆ సినిమా కాకుండా టాలీవుడ్‌లో మరే సినిమాలోనూ ఈమె నటించడం లేదు.

ప్రస్తుతం కన్నడంలో ఒక సినిమాను చేస్తున్నప్పటికీ అందులో ఈమె పాత్ర ఎంత ఉంటుంది, ఏ మేరకు గుర్తింపు లభిస్తుంది అనేది అనుమానమే. ఎందుకంటే ఆ సినిమా కిచ్చ సుదీప్‌ హీరోగా రూపొందుతోంది. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు సాధారణంగా ప్రాముఖ్యత ఉండదు అంటారు. అందుకే ఈ సినిమాలో ఆమె పాత్ర విషయంలో పెద్దగా అంచనాలు, ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. టాలీవుడ్‌లో తెలుసు కదా సినిమా విడుదల తర్వాత ఒకటి రెండు ఆఫర్లు అయినా దక్కక పోవా అని ఎదురు చూస్తుంది. వచ్చిన ఆఫర్లను తిరస్కరించడం అనేది శ్రీనిధి చేసిన పెద్ద తప్పు అని, ఇండస్ట్రీలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఉంటుందని, ఆ సామెతను శ్రీనిధి పాటించినట్లుగా అనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.