Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: అమెరికా MIT మొదటి అంధ విద్యార్థి క‌థ‌

తన జీవిత‌క‌థ‌తో సినిమా తీసిన చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధ‌న్య‌వాదాలు తెలిపారు.

By:  Tupaki Desk   |   14 April 2024 5:58 AM GMT
ట్రైల‌ర్ టాక్: అమెరికా MIT మొదటి అంధ విద్యార్థి క‌థ‌
X

కొన్నేళ్లుగా భార‌త‌దేశంలో బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతోంది. స్ఫూర్తిని ర‌గిలించే గొప్ప వ్య‌క్తుల‌ జీవిత‌క‌థ‌ల్ని వెతికి మ‌రీ మేక‌ర్స్ అద్భుతాలు చేస్తున్నారు. అసాధార‌ణ‌మైన వ్య‌క్తుల‌ జీవితంలోని స్పైస్‌ని ఎమోష‌న్‌ని తెర‌పైకి తేవ‌డంలో ద‌ర్శ‌కుల ప‌నిత‌నం నిజంగా ప్ర‌శంసార్హ‌మైన‌ది. ఇప్పుడు అలాంటి ప్ర‌శంసా పూర్వ‌క‌మైన మ‌రొక బ‌యోపిక్ సినిమా థియేట‌ర్ల‌లో అల‌రించేందుకు వ‌స్తోంది.

బాలీవుడ్ ట్యాలెంటెడ్ న‌టుడు రాజ్‌కుమార్‌రావు నటించిన ఈ సినిమా ఒక తెలుగు అంధ విద్యార్థి స్ఫూర్తివంత‌మైన క‌థ‌తో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి స్ఫూర్తినిచ్చిన విద్యార్థి పేరు శ్రీ‌కాంత్ బొల్లా. అమెరికాలోని MIT మొదటి అంధ విద్యార్థిగా అత‌డు ఒక సంచ‌ల‌నం. శ్రీ‌కాంత్ బొల్లా సాధించిన అసాధార‌ణ విజ‌యాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క‌ళ్లు లేక‌పోయినా లోకాన్ని త‌న‌దైన మేధోత‌నం స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌తో ఏలాడు. తెలుగు కుర్రాడు ఒక వ్యవస్థాపకుడు, పరోపకారి, బొల్లంట్ ఇండస్ట్రీస్ CEOగా సుప‌రిచితుడు. ఇప్పటి వరకు ఈ 32 ఏళ్ల అంధుడు సాధించిన విజయాలు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అత‌డి గురించి ఇంకా తెలుసుకుని తీరాలి అనిపించేంత స్ఫూర్తి ర‌గులుతోంది. తాజాగా రిలీజైన 'శ్రీ‌కాంత్' ట్రైల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌ను క‌లిగించింది. గొప్ప స్ఫూర్తిని ర‌గిలించింది.

శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం జిల్లా సీతారామపురంలో ఒక రైతు కుటుంబంలో అంధుడిగా జన్మించాడు. ఉపయోగం లేనివాడు! అని భావించి అతడి బంధువులు వదిలించుకోవాలని అతడి తల్లిదండ్రులకు సూచించారు. అయినా కానీ అతడి విధిలో ఇంకేదో ఉంది. వాస్త‌వ క‌థ వేరుగా మారింది.

బిజినెస్ మేనేజ్‌మెంట్ సైన్స్ చదవడానికి అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చేరిన మొట్టమొదటి అంధ విద్యార్థిగా శ్రీకాంత్ బొల్లా ఖ్యాతి ఘ‌డిస్తాడు. బొల్లాకు కంప్యూటర్ సైన్స్‌పై మంచి అభిరుచి ఉన్నప్పటికీ మేనేజ్‌మెంట్ స్టడీస్‌పై దృష్టి పెడ‌తాడు. అతడు సొంతంగా కంపెనీ ప్రారంభించి ఒక వ్యవస్థాపకుడుగా మార‌తాడు. భవిష్యత్ నాయకుడిగా ఉండాలని ఆలోచిస్తాడు. వాస్తవానికి అతడి ఆశయాలలో ఒకటి భారతదేశానికి రాష్ట్రపతి కావడం. ''మేనేజ్ మెంట్.. అది నా చేతుల్లోనే ఉంది, నా ఆలోచనలతో నేను చాలా డబ్బు సంపాదించగలను.. ఆ డబ్బుతో ఇతరులకు సహాయం చేయగలను.. సహాయక సాంకేతిక పరికరాలను తయారు చేసే కంపెనీని ప్రారంభిస్తాను'' అని MIT పోర్టల్‌లో శ్రీకాంత్ ప్రొఫైల్ ఉండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నవంబర్ 2011లో వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ అప్‌డేట్ అయి ఉంది. అతడి అంధత్వం కారణంగా IIT కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ ల‌భించ‌దు.

మే 10న శ్రీకాంత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం విడుదల కానుండగా తాజాగా రిలీజైన‌ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. రాజ్‌కుమార్‌రావు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక అతడి గురువు పాత్రలో న‌టించ‌గా, అలయ ఎఫ్ అతడి ప్రేమికురాలి పాత్రలో నటించింది. భారతదేశపు మొదటి అంధుడైన రాష్ట్రపతి కావాలనే తన ఆశయాన్ని ప్ర‌క‌టించ‌డంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం శ్రీకాంత్‌కు సైన్స్ పై ఉన్న అభిరుచి, అతడి ఆశయాలు.. భారతీయ విద్యావ్యవస్థను దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి అతడు చేసిన ప్రయత్నాల గురించి చెబుతుంది.

తన జీవిత‌క‌థ‌తో సినిమా తీసిన చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధ‌న్య‌వాదాలు తెలిపారు. నేను పాఠశాలలో ఉన్నప్పుడు, టీ-సిరీస్ రూపొందించిన క్యాసెట్ టేపుల్లో నా ఉపాధ్యాయులు నా కోసం పాఠాలు నేర్చుకునేందుకు నాకు సహాయపడిన ఉపన్యాసాలను రికార్డ్ చేశారు. ఈ రోజు జీవితం తిరిగి అక్క‌డే ఆగింది. అదే సంస్థ నా కథను మొత్తం ప్రపంచానికి తీసుకువెళుతోంది. ట్రైల‌ర్ నా జీవిత వృత్తంలోకి తీసుకెళుతోంది'' అని అన్నారు. నా జీవితంలోని చాలా విష‌యాల‌ను ట్రైల‌ర్ లో చూపించారు. ఇవ‌న్నీ నాలో ఉద్వేగాల వరదను పారేలా చేసాయి. నేను అధిగమించిన సవాళ్లు .. నేను చూసిన విజయాలు మన మానవుల ఆత్మలలో పునరుద్ధరణకు గుర్తుగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. కానీ నన్ను మించి నా క‌థ‌కు ప్రాణం పోయడానికి వారి సమయాన్ని శక్తిని అంకితం చేసిన ప్రతిభావంతులైన వ్యక్తుల అభిరుచి, ప్రామాణికత ప‌ట్ల‌ కృతజ్ఞతను క‌లిగి ఉన్నాను. నిజంగా ప్రశంసనీయం'' అని అన్నారు. ఈ ట్రైలర్ ఇతరులలో స్ఫూర్తిని నింపుతుందని నేను ఆశిస్తున్నాను. జీవితంలో ఇలాంటి అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి నా చిన్న కథ ఒక ఆశాజ్యోతిగా పనిచేస్తే, లక్ష్యం నెరవేరుతుంది అని అన్నారాయన.