శ్రీకాంత్ 'ఆచార్య'.. ఆ కథేంటి?
` ఆచార్య` అనగానే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన డిజాస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది.
By: Tupaki Desk | 9 May 2025 3:50 AM` ఆచార్య` అనగానే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన డిజాస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ 2022లో విడుదలై ఘోరమైన విమర్శలను మూటగట్టుకుంది. బడ్జెట్ లో కనీసం సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ మెగా ఆచార్య గురించి పక్కన పెడితే.. గతంలో శ్రీకాంత్ హీరోగా ఒక ` ఆచార్య` పట్టాలెక్కిందన్న విషయం మీకు తెలుసా?
2013లో జరిగిన సంగతిది.. రక్ష సినిమా ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ఆచార్య పేరుతో ఓ సినిమా ప్రకటించబడింది. లేపాక్షి బ్యానర్ పై గురురాజ్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సినిమాను అనౌన్స్ చేయడమే కాదు.. ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. లాంఛింగ్ ఈవెంట్ లో శ్రీకాంత్ పై క్లాప్ కొట్టారు సునీల్. హైదరాబాద్ లోనే ఆచార్య సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే ` వార్నింగ్: లవ్ ఈజ్ ఇంజూరియస్ టు యూత్` అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ ను సినిమాకు పెట్టారు. అయితే ఏమైందో ఏమో గానీ.. ఫస్ట్ షెడ్యూల్ ముగిశాక ఆచార్య ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరూ ఈ మూవీని రిస్టార్ట్ చేసే ప్రయత్నం చేయలేదు సరికదా దాని వొంక కూడా చూడలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేక మరే ఇతర కారణం వల్లనో శ్రీకాంత్ ఆచార్య ఆరంభంలోని అటకెక్కింది.
కాగా, హీరోగా ఫేడౌట్ అయ్యాక శ్రీకాంత్ సహాయక నటుడిగా మారిన సంగతి తెలిసిందే. సౌత్ భాషా చిత్రాల్లో బలమైన క్యారెక్టర్ రోల్స్ పోషించడమే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతినాయకుడిగానూ శ్రీకాంత్ అలరిస్తున్నారు. మరోవైపు ట్రెండ్ ను ఫాలో అవుతూ వెబ్ సిరీస్‌లలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది తెలుగులో ` గేమ్ ఛేంజర్`, ` అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి` వంటి చిత్రాల్లో శ్రీకాంత్ కనిపించారు.