అతని కోసం 70లక్షలు త్యాగం చేసిన శ్రీదేవి.. నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!
టాలీవుడ్ , బాలీవుడ్ లోనే కాకుండా ఎన్నో భాషలలో నటించి స్టార్ హీరోయిన్ గ ఒక వెలుగు వెలిగింది దివంగత నటీమణి శ్రీదేవి.
By: Tupaki Desk | 9 Sept 2025 7:00 AM ISTటాలీవుడ్ , బాలీవుడ్ లోనే కాకుండా ఎన్నో భాషలలో నటించి స్టార్ హీరోయిన్ గ ఒక వెలుగు వెలిగింది దివంగత నటీమణి శ్రీదేవి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. శ్రీదేవి చివరి రోజుల్లో నటించిన చిత్రం 'మామ్'. ఈ చిత్రానికి డైరెక్టర్గా రవి ఉదయవర్ వ్యవహరించగా.. బోనీ కపూర్ నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నారు.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీకపూర్ ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తన భార్య శ్రీదేవి ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడింది? ఎలాంటి త్యాగాలు చేసింది? అనే విషయాలను అభిమానులకు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి గురించి బోనీ కపూర్ మాట్లాడుతూ.. "బాలీవుడ్ కి వచ్చినప్పుడు శ్రీదేవికి హిందీ మాట్లాడడం తెలియదు. అందుకే ఆమె మొదటి ఆరు చిత్రాలకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. ఇదే కంటిన్యూ అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావని, కెరియర్ గాడి తప్పుతుందని భావించి.. ఒక కోచ్ ను పెట్టుకొని మరీ హిందీ నేర్చుకుంది. ముఖ్యంగా ఆమె డబ్బింగ్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా హిందీ కోచ్ పక్కనే ఉంటారు. ఈమె హిందీ మాత్రమే కాదు మలయాళం కూడా అలాగే నేర్చుకుంది.
తాను నటించిన చివరి చిత్రం మామ్. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వంటి భాషలలో విడుదల అయ్యింది. మలయాళం ఈమెకు రాదు. కానీ డబ్బింగ్ రూమ్లో మలయాళ డబ్బింగ్ ఆర్టిస్ట్ సమక్షంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ముఖ్యంగా తన పాత్రకు లిప్ సింక్ చేస్తూ.. డబ్బింగ్ చెప్పింది. మలయాళ డబ్బింగ్ ఆర్టిస్ట్ సమక్షంలో డబ్బింగ్ చెప్పడం వల్ల తన డబ్బింగ్ లో లోపాలు సరి చేసుకోవచ్చనేది ఆమె భావన. అలా ప్రతి సినిమా కోసం ఆమె చాలా డెడికేటెడ్ గా పనిచేసేది. ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన అన్ని పనులను కూడా ఆమె దగ్గరుండి మరీ చూసుకునేది. అలాంటి నిబద్ధత కలిగిన వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు" అంటూ బోనీకపూర్ తెలిపారు.
మామ్ సినిమా కోసం శ్రీదేవి కొంత రెమ్యూనరేషన్ ని కూడా వదులుకుందని కూడా తెలిపారు. బోనీకపూర్ మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న ఖరీదైన సంగీత దర్శకుడిగా పేరుపొందిన వ్యక్తి కావడం చేత మేము ఆలోచనలో పడ్డాము. దాంతో శ్రీదేవి తన రెమ్యూనరేషన్ లో 70 లక్షల రూపాయల వరకు తగ్గించుకొని, ఆ మొత్తాన్ని ఏఆర్ రెహమాన్ కి ఇవ్వాలని చెప్పింది. శ్రీదేవి ఆ ఒక్క మాట చెప్పడంతో మా పని చాలా సులువు అయిందని" తెలిపారు.
మామ్ సినిమాని ఎక్కువగా జార్జియా , నోయిడా వంటి ప్రాంతంలో చేశామని.. తన రూమ్ లో ఎప్పుడు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకునేదంటూ బోనికపూర్ తెలిపారు. మామ్ సినిమా 2017లో విడుదల అవ్వగా.. శ్రీదేవి 2018లో మరణించింది. నాలుగు భాషలలో విడుదలైన మామ్ చిత్రం 30 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా.. ఏకంగా 175 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. దీన్నిబట్టి చూస్తే శ్రీదేవి క్రేజ్ ఎంతలా ఉందో చెప్పవచ్చు.
