వైట్ల ఈ సారైనా వారికి హిట్టిస్తాడా?
ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సినిమా తీసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా అనుకున్నది జరగడం లేదు.
By: Tupaki Desk | 10 Jun 2025 6:00 PM ISTఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలను తీసి స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల. అతని సినిమాల్లోని కామెడీ సీన్లకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. క్లీన్ కామెడీతో ఆడియన్స్ ను అలరించే శ్రీను వైట్ల గత కొంత కాలంగా ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాడు. ఎన్నో సినిమాలుగా ఆయనకు సక్సెస్ అందని ద్రాక్షలానే మిగిలింది.
ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సినిమా తీసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా అనుకున్నది జరగడం లేదు. ఓ సినిమా చేయడం, అది ఫ్లాప్ అవడం, ఆ తర్వాత శ్రీను వైట్లకు ఇంకెవరు ఛాన్స్ ఇస్తారని అందరూ అనుకోవడం, ఎవరూ ఊహించని విధంగా భారీ సినిమాను సెట్ చేసి సినిమాను తీసి అందరినీ ఆశ్చర్యపరచడం గత కొన్నేళ్లుగా శ్రీను వైట్లకు అలవాటైపోయింది.
శ్రీను వైట్ల నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా విశ్వం. గోపీ చంద్ హీరోగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న అంచనాలను అందుకోవడంలో విశ్వం సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఈ మూవీ ఫుల్ రన్ ముగిసే నాటికి సేఫ్ జోన్ కు చేరుకుని నిర్మాతలకు మంచి రాబడినే అందించింది.
విశ్వం సినిమా తర్వాత శ్రీను వైట్ల నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ క్రేజీ వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీను వైట్ల ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్. ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ స్టార్ కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల, మైత్రీ సంస్థలో సినిమా చేయనుండటం హాట్ టాపిక్ గా మారడంతో పాటూ ఈ ప్రాజెక్టుపై అందరికీ భారీ అంచనాలు కూడా ఏర్పడేలా చేసింది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. అయితే గతంలో శ్రీను వైట్ల, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ, ఇలియానా జంటగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేయగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మైత్రీతో శ్రీను వైట్ల మరోసారి చేతులు కలపనున్నాడు. మరి ఈ సారైనా శ్రీను మైత్రీకి హిట్ అందిస్తాడేమో చూడాలి.
